హరీశ్‌ రావుతో టీటీడీ ఛైర్మన్ భేటీ

5
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బి.ఆర్. నాయుడు ఇవాళ మాజీ మంత్రి హరీశ్‌ రావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, హరీష్ రావు గారు నాయుడు గారికి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

మీడియా రంగంలో సుదీర్ఘకాలంగా విశేష సేవలు అందించిన నాయుడు గారు, కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి సేవ చేసే భాగ్యం పొందడం అదృష్టమని హరీష్ రావు అభిప్రాయపడ్డారు.టీటీడీ చైర్మన్‌గా నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి కోసం మరింత కృషి చేస్తారని హరీష్ రావు గారు విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలలో స్వామి దర్శనం కోసం వస్తున్నందున, తెలంగాణ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యుల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవాలని హరీష్ రావు కోరారు. తెలంగాణ భక్తులకు దర్శనం, వసతి వంటి సేవలను మెరుగుపరచడానికి ఈ చర్యలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.

హరీష్ రావు గారి విజ్ఞప్తికి నాయుడు గారు స్పందిస్తూ, తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖలను పరిగణనలోకి తీసుకోవడం గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారితో మాట్లాడి, టీటీడీ బోర్డులో చర్చించి, సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.సిద్దిపేటలో కూడా టీటీడీ దేవాలయం నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నందున, నిర్మాణ పనులు త్వరగా ప్రారంభించాలని హరీష్ రావు కోరారు. సిద్దిపేటతో పాటు కరీంనగర్ లో నిర్మాణంలో ఉన్న టీటీడీ దేవాలయ పనులను పూర్తి చేసేందుకు బోర్డులో చర్చిస్తామని నాయుడు తెలిపారు.

Also Read:పొంగులేటి ఆస్తులపై దాడుల అప్‌డేట్ ఏది?

- Advertisement -