పల్లెలకు కదిలిన పట్నం ప్రజలు..కిక్కిరిసిన రైళ్లు, బస్సులు

588
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా దసరా పండుగ వాతావరణం నెలకొంది. సొంతూళ్లకు బయలు దేరే ప్రయాణికులతో బస్టాండ్ లు,రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీఎస్ఆర్టీసీతో పాటు రైల్వే శాఖ ప్రత్యేక బస్సులు,రైళ్లను నడుపుతోంది.

హైదరాబాద్‌లోని పలు బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ పెరగడంతో మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లి బస్‌స్టాండ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు కిక్కిరిసాయి. ప్రయాణికులకు తమ సొంత గ్రామాలకు చేర్చడానికి టీఎస్ఆర్టీసీ ఇప్పటికే అదనపు ఏర్పాటు చేయగా.. 16 నుంచి 18వ తేదీల్లో హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు మరిన్ని బస్సులను నడుపనుంది. అంతేగాదు ప్రజలకు తిరుగు ప్రయాణం అప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బస్సులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.


తెలంగాణ నుంచి ఏపీ,కర్నాటకలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడుపుతోంది టీఎస్ ఆర్టీసీ. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు ఛార్జీలను వసూలు చేయనున్నారు.  ముఖ్యంగా 17, 18వ తేదీల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో  అడ్వాన్స్ రిజర్వేషన్ల సౌకర్యం ఏర్పాటు చేశారు అధికారులు. ప్రయాణికులకు ఎలాంటి అసౌక్యం కలుగకుండా హైదరాబాద్ నుండి అన్నిజిల్లాలకు బస్సులను నడుపుతున్నామని చెప్పారు.

తెలంగాణలోని అన్నిజిల్లా కేంద్రాలతో పాటు నంద్యాల, ఆత్మకూరు, వెలుగోడు, నందికొట్కూరు, కోయలకుంట్ల, ఆళ్లగడ్డ, మైదుకూరు, బనగానపల్లి, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, పులివెందుల, కడప, రాజంపేట, చిత్తూరు వైపు బస్సులు నడుపుతున్నారు అధికారులు.

పండుగ రద్దీ కారణంగా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బస్‌స్టాండుల్లో ప్రత్యేక ఫ్లాట్‌ఫాంలను ఏర్పాటు చేసింది టీఎస్ఆర్టీసీ. ఒక్కో ప్రాంతానికి ఒక్కో పాయింట్ నుంచి బస్సులను ఏర్పాటు చేశారు.

- Advertisement -