మా మధ్య గొడవలు లేవు..

215
- Advertisement -

టి.సుబ్బిరామిరెడ్డి కల్చరల్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో శనివారం విశాఖపట్నం పోర్టు స్టేడియంలో జరిగిన టీఎస్‌ఆర్‌ నేషనల్‌ జాతీయ ఫిల్మ్‌ అవార్డ్స్‌-2015,16 ప్రదానోత్సవం కన్నుల పండువగా సాగింది. వివిధ భాషల్లో నటించిన 65 మందికి టీఆర్‌ఎస్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డులను నందమూరి బాలకృష్ణ అందజేశారు. సినీ ప్రముఖులు హేమామాలిని (మిలీనియం కథానాయిక), కృష్ణంరాజు (5డికేడ్స్‌ స్టార్‌), మోహన్‌బాబు (4 డికేడ్స్‌ స్టార్‌), జాకీష్రాఫ్‌ (సెన్సేషనల్‌ స్టార్‌) పురస్కారాలు దుకొన్నారు. వెంకటేష్‌ (2015 ఉత్తమ నటుడు), నందమూరి బాలకృష్ణ (ఉత్తమ కథానాయకుడు 2016), నాగార్జున (ఉత్తమ నటుడు 2016) అవార్డులు అందుకొన్నారు.

ఈ సందర్భంగా టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ కళ అనేది ఈశ్వర శక్తి అని, కళను అభిమానించేవాడే కళాకారులను ఆదరిస్తాడని అన్నారు. లక్షలాది మంది ప్రేక్షకులను అలరిస్తున్న సినీ ప్రముఖులకు అవార్డులు అందజేయడం ఆనందంగా ఉందన్నారు.

బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘విశాఖ నగరంతో నాకెంతో అనుబంధం ఉంది. నా సినిమాలెన్నో ఇక్కడ చిత్రీకరణ జరుపుకొన్నాయి. ఇలాంటి అవార్డులు మరిన్ని మంచి చిత్రాల్ని అందించాలన్న స్ఫూర్తి అందిస్తాయ’’న్నారు.

‘‘బాలకృష్ణకూ నాకూ ఏవో గొడవలు ఉన్నాయంటూ పిచ్చి పిచ్చి రూమర్లున్నాయి. అలాంటివేం లేవు. మేమిద్దరం మంచి మిత్రులం’’ అన్నారు నాగార్జున.

‘‘ఉత్తరాది, దక్షణాది సినీ ప్రముఖుల్ని ఇంత ఘనంగా సత్కరించడం సుబ్బిరామిరెడ్డిగారికే చెల్లింద’’న్నారు చిరంజీవి.

‘‘నలభై ఆరేళ్ల సినీ ప్రయాణం నాది. 650 చిత్రాలకు పనిచేశా. అందులో తెలుగు చిత్రాలూ ఉన్నాయ’’న్నారు లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు గ్రహీత బప్పీలహరి. ‘‘శ్రీకృష్ణదేవరాయుల వారు అప్పట్లో కళల్ని, కళాకారుల్ని గౌరవిస్తారని చదువుకొన్నాం. అలా సుబ్బిరామిరెడ్డి కళల్ని ప్రోత్సహిస్తున్నార’’న్నారు మోహన్‌బాబు.

- Advertisement -