గత పాలకుల అసమర్థ వైఖరి వల్లే నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బారిన పడిందన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లాలో జరిగిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడిన కేటీఆర్ దివ్యాంగుల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వాలు అసమర్థ ప్రభుత్వాలు అని తెలిపారు. దేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లోలేని విధంగా దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేశారని తెలిపారు. దివ్యాంగులకు నెలకు 1500 పింఛన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది దివ్యాంగులకు పింఛన్ అందిస్తున్నామని తెలిపారు.దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు సైనికుల్లా పనిచేయాలని సూచించారు.
టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే పింఛన్ రూ. 3వేలకు పెంచుతున్నామని తెలిపారు. దివ్యాంగులు ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే సీఎం కేసీఆర్ అభిమతమన్నారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం వాసుదేవరెడ్డి నిబద్దతతో పనిచేస్తున్నారని చెప్పారు. 8 కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 7 వేల మందికి ఉచిత సహాయ ఉపకరణలు పంపిణి చేశామన్నారు.
దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో దివ్యాంగులకు 5 శాతం కేటాయిస్తామన్నారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ప్రత్యేకంగా 4 కోట్లతో జాతీయ స్ధాయి పార్క్‌ను ప్రారంభించామని చెప్పారు. దివ్యాంగులు కోరుకునేంది సానుభూతి కాదని ఆత్మగౌరవంతో బ్రతకాలని కోరుకుంటున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం తరపున మరింత ప్రోత్సాహం కల్పిస్తామన్నారు. పోటీ పరీక్షల కోసం శిక్షా కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు.దివ్యాంగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు కేటీఆర్.
తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలని కాలంతో పోటీ పడి సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. భవిష్యత్‌లో తెలంగాణలో పుట్టబోయే ఏ బిడ్డ కూడా ఫ్లోరైడ్ బారిన పడకూడదన్నారు. ఓట్లు,సీట్ల కోసం పనిచేసే ప్రభుత్వం టీఆర్ఎస్‌ది కాదన్నారు.