రాష్ట్రంలో కరోనా సమాచారం కోసం వాట్సాప్ చాట్ బాట్..

451
ktr
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం 9000 658 658 నెంబరుపై “TS Gov Covid Info” పేరిట ఒక వాట్సాప్ చాట్ బాట్ ను సోమవారం ప్రారంభించింది. కోవిడ్-19పై సమాచారం, నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పౌరులకు తెలియజేసేందుకు ఈ వాట్సాప్ వేదికను ఉపయోగించుకోనున్నది.

“కరోనా వైరస్ పై పోరుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేస్తున్నది. అన్ని వేదికలను ఉపయోగించుకుంటున్నది. కరోనా మహమ్మారిపై పౌరులకు ప్రామాణికమైన సమాచారం అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వాట్సాప్ సౌజన్యంతో ఈ నిర్దిష్టమైన చాట్ బాట్ రూపొందించింది. లాక్ డౌన్ ను గౌరవిస్తూ ప్రజలందరూ ఇంటి వద్దనే ఉండాలి. అధికారిక మాధ్యమాల ద్వారా విడుదల చేసిన సమాచారంపైనే ఆధారపడాలి.” అని చాట్ బాట్ ను ఆవిష్కరిస్తూ ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీ రామా రావు అన్నారు.

corona wtsapp

హైద్రాబాదుకు చెందిన సాఫ్ట్వేర్ పరిష్కారాల సంస్థ ఎస్.బి. టెక్నాలజీస్, వాట్సాప్ అధికారిక వ్యాపార పరిష్కారాల భాగస్వామి మెసెంజర్ పీపుల్ లతో కలిసి తెలంగాణ ఐటీ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలు సంయుక్తంగా ఈ చాట్ బాట్ నిర్మించాయి.

ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ జయేష్ రంజన్ ఈ సందర్బంగా మాట్లాడుతూ, “కోవిడ్-19కి సంబంధించి పౌరులకు ఏవైనా ప్రశ్నలు, సందేహాలు ఉంటే వాట్సాప్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. చాట్ బాట్ సంభాషణ ప్రారంభించడానికి +91-9000658658 నంబరుకి ‘Hi’ లేదా ‘Hello’ లేదా ‘Covid’ అని వాట్సాప్లో సందేశం పంపించాలి. లేదా https://wa.me/919000658658?text=Hi లింకును తమ మొబైల్ నుండి క్లిక్ చేయాలి. క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభుత్వానికి అందిస్తున్న సహకారానికి ఫేస్‌బుక్, వాట్సాప్ మరియు వారి సాంకేతిక, వ్యాపార భాగస్వాములకు ధన్యవాదాలు తెలుపుతున్నాం.” అని అన్నారు.

తెలంగాణ వాట్సాప్ చాట్ బాట్ కు సంబంధించి ఏవైనా సందేహాలు, సూచనలు ఉంటే covid19info-itc@telangana.gov.in కి ఈమెయిల్ చేయవచ్చు.

- Advertisement -