జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లు -2020ని అసెంబ్లీ ఏకగ్రీవంగా అమోదించింది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశ పెట్టిన కేటీఆర్…పంచాయతీరాజ్, పురపాలక చట్టం మాదిరిగానే జీహెచ్ఎంసీ చట్ట సవరణలో మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరాన్ని హరితనగరంగా మార్చేందుకు ఈ సవరణ ఉపయోగపడుతుందన్నారు.
జీహెచ్ఎంసీ చట్ట సవరణలో భాగంగా వార్డు కమిటీలను నియమిస్తున్నట్లు తెలిపారు కేటీఆర్. నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం పెంచేందుకే వార్డు కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని ఈ కమిటీల ఏర్పాటు రాజకీయాలకు అతీతంగా ఉంటుందన్నారు. యూత్ కమిటీ, మహిళా కమిటీ, సినీయర్ సిటిజెన్ కమిటీ,ఎమినెంట్ సిటిజెన్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కమిటీల్లో మహిళలకు 50 శాతం భాగస్వామ్యం ఉంటుందన్నారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు గత ప్రభుత్వాలు సంకల్పించలేదు. కొత్త చట్టం తీసుకురావాలనే ఆలోచన వారికి లేదు. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమైన ఐదు సవరణలు చేసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. మహిళా సాధికారతకు పెద్దపీట వేయాలనే ఆలోచనతో మహిళా రిజర్వేషన్లకు ఇవాళ చట్టం చేసుకుంటున్నామని తెలిపారు.
పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టంలో 10 శాతం బడ్జెట్‌ను గ్రీన్ కవర్‌కు కేటాయించామన్నారు. 85 శాతం మొక్కలు బతకాలనే ఉద్దేశంతో అధికారులు, ప్రజాప్రతినిధులకు అప్పజెప్పామన్నారు. రెండు టర్మ్‌లు ఒకే రిజర్వేషన్ ఉండేలా పంచాయతీరాజ్, పురపాలక చట్టంలో తీసుకువచ్చాం. అదే పాలసీని జీహెచ్ఎంసీ యాక్ట్‌లో చేర్చతున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు.
యధాతథంగా బీసీల రిజర్వేషన్ కొనసాగుతోంది. బీసీల విషయంలో 33 శాతం రిజర్వేషన్లు ఉన్నప్పటికీ 83 మంది బలహీన వర్గాల సోదరులను గెలిపించుకున్నామని చెప్పారు.