అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యా నుంచి అమెరికాకు డీజిల్ సరఫరా చేసేందుకు ఒప్పందం కుదిరిందని ప్రకటించారు. పెరుగుతున్న చమురు సంక్షోభాన్ని నియంత్రించి, నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు ఇంధన ధరలను తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే, ఈ నిర్ణయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రష్యాపై ఆంక్షలను సడలించడం యుద్ధాన్ని ముగించడానికి బదులుగా దానికి పెట్టుబడి పెట్టడమేనని విమర్శించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం ఈ ప్రకటన చేశారు. రష్యా 3 లక్షల టన్నులకు పైగా డీజిల్‌ను తక్షణమే అమెరికా, అంతర్జాతీయ మార్కెట్లకు సరఫరా చేయడానికి అంగీకరించిందని ట్రంప్ తెలిపారు. నవంబర్‌లో మరో 5 లక్షల టన్నులు, ఆ తర్వాత వెంటనే 10 లక్షల టన్నుల డీజిల్‌ను సరఫరా చేయనున్నట్లు తన ట్రూత్ సోషల్ పోస్టులో పేర్కొన్నారు.
అమెరికా ప్రజలకు, ముఖ్యంగా రైతులు, పశుపోషకులు, ట్రక్కు డ్రైవర్లకు ఇంధన ధరలను తగ్గించడం తన ప్రధాన ప్రాధాన్యమని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ ప్రకటన ఎంతో కీలకమైనదని అభివర్ణించారు. అదే సమయంలో ఇరాన్ అణ్వాయుధాన్ని పొందేందుకు అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని మరోసారి స్పష్టం చేశారు. హార్ముజ్ జలసంధిపై తమ నియంత్రణ, రష్యా నుంచి ఇంధన సరఫరా కారణంగా అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో వేగంగా తగ్గుతాయని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read:విమర్శలకు భయపడేది లేదు!
ట్రంప్ నిర్ణయంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్రంగా స్పందించారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలు మాస్కో యుద్ధానికి ఆర్థికంగా మద్దతిస్తున్నాయని గతంలోనూ ఆయన విమర్శించారు. ఇప్పుడు రష్యాపై ఆంక్షల సడలింపు యుద్ధాన్ని ముగించాల్సిన సమయంలో దాన్ని మరింత పొడిగించేందుకు పెట్టుబడి పెట్టినట్లేనని వ్యాఖ్యానించారు.

