లక్షల మందిని రోడ్డున పడేసిన ట్రంప్..

198
- Advertisement -

అధికారంలోకి వచ్చినప్పటినుంచీ వలస దారులు ,శరణార్థులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పుడు ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం వల్ల దాదాపు 8 లక్షల మంది వలసదారుల జీవితాలు అగమ్యగోచరంలో చిక్కుకున్నాయి. అమెరికాలో వలసదారుల పిల్లలకు రక్షణ కల్పిస్తూ ఒబామా తీసుకొచ్చిన ఉత్తర్వులను డొనాల్డ్‌ ట్రంప్‌ రద్దు చేయాలని నిర్ణయించారు.

Trump just turned DACA into a ticking time bomb for 800,000 ..

చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులతో పాటు అమెరికా వచ్చి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న యువత(డ్రీమర్స్‌)ను అక్రమ వలసదారులుగా గుర్తించారు. సుమారు 8 లక్షల మంది డ్రీమర్స్‌ వర్క్‌ పర్మిట్లను రద్దుచేశారు. వీరిలో 7వేల మంది భారతీయ అమెరికన్లూ ఉన్నారు.

అమెరికాలో నివసించేందుకు, పనిచేసేందుకు వీరికి అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేవు. ఈ డ్రీమర్లు దేశ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తున్నారని, వారిపై దయ చూపాలే తప్ప శిక్షించరాదనే అభిప్రాయంతో ఒబామా 2012లో చట్టపరంగా వెసులుబాటు కల్పించారు.

‘బాల్యంలో వచ్చినవారిపై చర్యల వాయిదా’ (డిఫర్డ్‌ యాక్షన్‌ ఫర్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌–డీఏసీఏ) సహాయ కార్యక్రమాన్ని 2012 జూన్‌ 15న ఆయన ప్రకటించారు. అమెరికా ఫెడరల్‌ సర్కారు నిధులతో అమలయ్యే ఈ కార్యక్రమంలో 8 లక్షల మంది పెట్టుకున్న దరఖాస్తుల్ని ఆమోదించారు. వీరు ప్రతి రెండేళ్లకు తమ వర్క్‌ పర్మిట్లను పొడిగించుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆ వర్క్‌ పర్మిట్లనే ట్రంప్‌ రద్దు చేశారు.

Trump just turned DACA into a ticking time bomb for 800,000 ..

ఇక ట్రంప్‌ తాజా నిర్ణయంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. డీఏసీఏ రద్దు అత్యంత క్రూరమైనదని డెమోక్రటిక్‌ జాతీయ కమిటీ అధ్యక్షుడు టామ్‌ పెరెజ్‌ అభివర్ణించారు. ‘‘ట్రంప్‌ తొలుత వలసదారుల తల్లిదండ్రుల రక్షణలను హరించివేశారు. ఇప్పుడు వారి పిల్లల వెంటపడ్డారు’’ అని దుయ్యబట్టారు. ట్రంప్‌ చర్య అమెరికాకు తీవ్ర విఘాతమేనని లాస్‌ ఏంజెలెస్‌ మేయర్‌ ఎరిక్‌ గార్సెటి వ్యాఖ్యానించారు.

మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఈ నిర్ణయం ఎనిమిది లక్షల మంది ‘డ్రీమర్ల’ జీవితాలపై ప్రభావం చూపేలా ఉందని ఇదో అనాలోచిత నిర్ణయమన్నారు. డ్రీమర్ల ప్రోగ్రాంకు ముగింపు పలికేలా తీసుకున్న ఈ నిర్ణయం ఉత్తమ భవిష్యత్తు కలిగిన యువకుల జీవితాల్లో చీకట్లు కమ్మేలా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. యువకులను లక్ష్యంగా చేసుకోవడం దారుణమని, అదో క్రూరమైన, హింసాత్మక నిర్ణయమని ఒబామా అభివర్ణించారు.

- Advertisement -