టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కేటీఆర్ తొలిసారిగా తన నియోజకవర్గం సిరిసిల్లలో నేడు పర్యటించనున్నారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. నేడు మొదటిసారిగా నియోజకవర్గానికి వెళ్తుడటంతో ఘన స్వాగతం పలకడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు కార్యకర్తలు. ఈసందర్భంగా సిరిసిల్లలోని టీఆర్ఎస్ నాయకులు స్ధానిక పద్మనాయక కళ్యాణమండపంలో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు.
హైదరాబాద్ నుంచి ఉదయం 8 గంటలకు కేటీఆర్ బయలుదేరి 10 గంటల వరకు రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్ చేరుకుంటారు. పాతబస్టాండ్‌లోని నేతన్న విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీగా 10.30 గంటలకు అంబేద్కర్ చౌరస్తాకు చేరుకుంటారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అక్కడనుంచి ఊరేగింపుగా 11 గంటలకు గాంధీచౌక్‌కు చేరుకుని గాంధీ విగ్రహానికి పూలమాల వేస్తారు.పద్మనాయక కల్యాణమండపం వరకు ర్యాలీ నిర్వహించి 12 గంటలకు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు హైదరాబాద్ తిరుగు ప్రయాణమై వెళ్లనున్నారు. రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు.