టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం శ్రీరాంనగర్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్‌కు లాభం చేకూరుతుందన్నారు. బీజేపీ ఎంపీలు గెలిస్తే మోదీకి లాభమని.. అదే టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభమన్నారు.‘గల్లీలో మనమే ఉండాలి.. దిల్లీలో మనమే ఉండాలి’అని కేటీఆర్ అన్నారు. అధికారం మొత్తం దిల్లీలోనే కాకుండా వికేంద్రీకరణ జరిగేలా టీఆర్‌ఎస్ విజయం ఉండాలన్నారు. రాష్ట్రాలకు విశేష అధికారాలు ఇవ్వాలని కోరారు.
మోదీ ఏదో చేస్తారని అధికారం ఇస్తే ఏమీ చేయలేదు. బీజేపీ వాళ్లకు ఎలక్షన్లప్పుడే రాముడు గుర్తుకొస్తారు. పెద్ద నోట్లు రద్దు చేసి ఆడవాళ్ల పోపుల డబ్బాలోని డబ్బులు మాయం చేశారు. మోదీ ఐదేళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. సికింద్రాబాద్‌లో గెలిచిన పార్టీదే ఢిల్లీలో హవా. మోదీ ఐదేళ్ల కింద చాయ్‌వాలా అన్నారు.. ఇప్పుడు చౌకీదార్ అంటున్నారు. మనకు కావాల్సింది చౌకీదార్లు, టేకేదార్లు కాదు. జోర్దార్, అసర్‌దార్, ఇమాన్‌దార్ కేసీఆర్ కావాలి. ఆరు నెలల్లో హైదరాబాద్‌లో డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తి చేస్తం.. అని కేటీఆర్ హామీ ఇచ్చారు.
సికింద్రాబాద్ లోక్‌సభ తెరాస అభ్యర్థి తలసాని సాయికిరణ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ రోడ్‌షోలో సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి సాయికిరణ్‌యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, టీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు. బోరబండ, ఎర్రగడ్డ, రహమత్‌నగర్ డివిజన్ల నుంచి ప్రజలు భారీగా హాజరయ్యారు.