టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తీవ్ర స్ధాయిలో విరుచుకుపడ్డారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిన్న అసెంబ్లీ ఎదుట ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండించారు కేటీఆర్. ఈసందర్భంగా తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు కేటీఆర్. కాంగ్రెస్ కు ఇద్దరూ గిరిజన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరనుండటంతో వారిని సీఎం కేసీఆర్ ఎంతకు కొన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు కేటీఆర్. రాజకీయాల్లో పార్టీలు మారడం కొత్త కాదన్నారు.
ప్రస్తుతం ఇప్పుడు కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ మొదటి నుంచి ఏ పార్టీలో ఉన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రేగె కాంతారావు, ఆత్రం సక్కు ఆదివాసీల అభివృద్ధి, తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు పత్రికా ప్రకటన విడుదల చేశారని గుర్తు చేశారు. నిన్న ఉత్తర్ ప్రదేశ్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో పార్టీలో చేరిన బీజేపీ ఎంపీ సావిత్రీ బాయి పూలెను ఎంతకు కొన్నారో చెప్పాలని ప్రశ్నించారు.
మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, భూపతిరెడ్డిలను కూడా ఎంతకు కొనుగోలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకత్వం లేకపోవడం వల్లే తాము పార్టీ మారుతున్నట్లు వారు స్పష్టంగా చెప్పారన్నారు. గిరిజన శాసనసభ్యులు టీఆర్ఎస్ లో చేరితే వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసే విధంగా చాలా అహంకారంతో దుర్మార్గంగా చేసిన వ్యాఖ్యలను నేను తప్పు పడుతున్నాను చెప్పారు కేటీఆర్.