కాంగ్రెస్‌ మునిగిపోయే నావ…ఉత్తమ్‌ ఓటమి తప్పదు: కేటీఆర్

623
ktr
- Advertisement -

హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైందని జోస్యం చెప్పారు మంత్రి కేటీఆర్. సూర్యపేట జిల్లా హుజుర్‌నగర్‌లో నిర్వహించిన రోడ్ షోలో మాట్లాడిన కేటీఆర్ ..2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే,అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుంచే తప్పుకుంటానని ప్రకటించిన ఉత్తమ్ ఇప్పుడు మాట తప్పారని ఎద్దేవా చేశారు.

హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందని ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలుసన్నారు. ఇప్పటివరకు ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన ఉత్తమ్ ప్రజలకు ఏం చేశాడో సమాధానం చెప్పాలన్నారు. హుజుర్‌నగర్ వెనుకబాటుకు కారణం ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు.జానారెడ్డి, కోమటిరెడ్డిల కు, కాంగ్రెస్ నాయకులకు పదవులు ముఖ్యం…. ప్రజా సమస్యలు పట్టవన్నారు.

దశాబ్దాల పాటు కాంగ్రెస్ గెలిస్తే…ప్రజలు ఓడిపోయారన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి జీ హుజుర్ అందామా….గులాబీ జెండాను గుండెలకు హద్దుకుందామా అన్నారు. హుజుర్ నగర్ ప్రజలు విజ్ఞులు,మేధావులు ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యేగా ఉత్తమ్ కుమార్ ఒక్క దరఖాస్తు కూడా సీఎంకు ఇవ్వలేదన్నారు. ఒక్క అభివృద్ధి పథకం కోసం దరఖాస్తు ఇవ్వలేదన్నారు. ఉత్తమ్ కుమార్‌కు అహంకారం ఎక్కువ అన్నారు. కాంగ్రెస్ నేతలకు ప్రజల కంటే వారికి పదవులపైనే మక్కువ అని ఆరోపించారు. హుజుర్‌నగర్ అభివృద్ధి కోసం టీఆర్ఎస్ చేసిన పనులను ప్రజలకు వివరించారు కేటీఆర్.

హుజుర్‌నగర్‌లో అభివృద్ధి కోసం రూ. 2 వేల కోట్ల రూపాయలను గడిచిన ఐదేళ్లలో కేటాయించామన్నారు. హుజుర్‌ నగర్‌లో రైతు బంధు ద్వారా 194 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. రైతు బీమా పథకం ద్వారా ఇక్కడి రైతులకు 20 కోట్ల రూపాయల బీమా చెల్లించామన్నారు.

రైతు రుణమాఫీ కోసం హుజుర్‌నగర్‌లో 196 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. 47 కోట్లతో గొర్రెల పంపిణీ చేశామని తెలిపారు. 6083 మందికి కళ్యాణలక్ష్మీ పథకం ద్వారా 33 కోట్లు అందించామన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా ఇక్కడ 4 కోట్ల రూపాయలు ఇచ్చామన్నారు. మిషన్ భగీరథ ద్వారా 111 కోట్లు కేటాయించామని తెలిపారు.

దేశంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి చూస్తుంటే గాలివానలో పడవ ప్రయాణంలానే ఉందన్నారు. ఆ పార్టీకి అధ్యక్షుడు లేడు ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న నావ అని మండిపడ్డారు. హుజుర్‌నగర్‌లో కాంగ్రెస్,బీజేపీ ఒక్కటయ్యాయని ఆరోపించారు కేటీఆర్. ప్రజలు ఆలోచించి టీఆర్ఎస్‌కు ఓటేయాలన్నారు. గడపగడపకు సంక్షేమం….పల్లె పల్లెకు అభివృద్ధి చేసి చూపుతామన్నారు. సైదిరెడ్డి ఎన్నికల ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తనదన్నారు.సీఎం కేసీఆర్ త్వరలోనే హుజుర్‌నగర్‌కు వస్తారని…ఇక్కడి ప్రజల హామీలను నెరవేరుస్తారని చెప్పారు.

- Advertisement -