నదీ జలాల వివాదాలను పరిష్కరించండి: వినోద్ కుమార్

173
vinod kumar
- Advertisement -

అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ముమ్మాటికీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు.ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇది రాష్ట్రాల పరిధిలో తేలే అంశం కాదని అన్నారు.నూతనంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన ఆరు వారాల్లోనే అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాన్ని పరిష్కరించాలని 14-7-2014 నాడు రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కేంద్ర జల వనరుల శాఖ మంత్రికి లేఖ రాశారని, అదే రోజు రాష్ట్ర ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి కి నోటీస్ ఇచ్చారని వినోద్ కుమార్ గుర్తు చేశారు.

అంతర్ రాష్ట్ర నదీ జలాల చట్టం 1956 లోని సెక్షన్ 3 ప్రకారం ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు లేకుండా పరిష్కారం చూపాలని గత ఆరేళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి, కేంద్ర జల వనరుల శాఖ మంత్రులు ఉమా భారతి, నితిన్ గడ్కరీ లకు లేఖలు రాశారని వినోద్ కుమార్ తెలిపారు.

దీంతో పాటు అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇరిగేషన్ కార్యదర్శి కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులకు లేఖలు రాశారని వినోద్ కుమార్ తెలిపారు.అంతర్ రాష్ట్ర నదీ జలాల సమస్యను పరిష్కరించాలని గత 16 వ లోక్ సభలో టీఆర్ఎస్ ఎంపీలు గట్టిగా గళాన్ని వినిపించారని, అప్పటి కేంద్ర మంత్రులు ఉమా భారతి, నితిన్ గడ్కరీ లపై ఒత్తిడి పెంచారని, ఈ విషయం మీడియాలో ప్రముఖంగా వచ్చిందని వినోద్ కుమార్ పేర్కొన్నారు.

సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర మంత్రి ఉమాభారతి ప్రయత్నం చేస్తున్న దశలో నాడు మహారాష్ట్ర, కర్నాటక బీజేపీ ఎంపీలు లోక్ సభలో గందరగోళం సృష్టించి అడ్డుకుని తెలంగాణ కు అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు.అంతర్ రాష్ట్ర నదీ జలాల చట్టం సెక్షన్ 3 ప్రకారం ఏడాదిలోగా కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించకుంటే సుప్రీంకోర్టులో సవాలు చేశామని, దీనిపై కేంద్రం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదని వినోద్ కుమార్ వివరించారు.

కనీసం విషయం తెలియకుండానే, విషయ పరిజ్ఞానం లేకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, ఇది వారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనమని వినోద్ కుమార్ విచారం వ్యక్తం చేశారు. అంతర్ రాష్ట్ర నదీ జలాల చట్టం సెక్షన్ 3 మేరకు ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసి ఈ వివాదాన్ని కేంద్ర ప్రభుత్వమే పరిష్కారం చూపాల్సి ఉంటుందని వినోద్ కుమార్ అన్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకుని జల వివాదాన్ని పరిష్కరించుకోవాలని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం మధ్య వర్తిత్వం వహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పడం బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని వినోద్ కుమార్ అన్నారు.కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలను విస్మరించి , విషయం తెలుసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం పై చౌకబారు విమర్శలు చేయడం శ్రేయస్కరం కాదని వినోద్ కుమార్ అన్నారు.

అంతర్ రాష్ట్ర నదీ జలాల అంశంలో రాష్ట్ర ప్రభుత్వ కృషి గురించి ఏ మాత్రం తెలుసుకోకుండా, అసలు విషయమే తెలియకుండా, విషయ పరిజ్ఞానం లేకుండా, కనీస అవగాహన లేకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.ఆరేళ్లుగా సీఎం కేసీఆర్ ఏం చేస్తున్నారు..? నిద్ర పోతున్నారా..?, ఇప్పుడు కేంద్రానికి లేఖ రాయడం ఏమిటీ…? అని బండి సంజయ్ చెప్పడం వింతగా ఉందని ఆయన అన్నారు.

తెలంగాణ పుట్టినప్పటి నుంచి కేంద్రానికి వరుసగా లేఖలు రాస్తూ, ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా వ్యక్తిగతంగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించడం సరికాదన్నారు.సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వివాదాలు పెట్టుకోవద్దని, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించాలని విశాల దృక్పథంతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారని ఆయన తెలిపారు.

పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ వైఖరి వల్ల దశాబ్దాల నుంచి అనేక ప్రాజెక్టులు అమలుకు నోచుకోలేదని వినోద్ కుమార్ గుర్తు చేశారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మరో ఇద్దరు బీజేపీ ఎంపీలకు రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర జల వనరుల శాఖ మంత్రిలపై ఒత్తిడి తెచ్చి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపుల కోసం ప్రస్తుతం ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు ఆదేశాలు ఇప్పించేందుకు కృషి చేయాలని వినోద్ కుమార్ సూచించారు.

- Advertisement -