ఎమ్మెల్సీ నువ్వానేనా..!

260
trs mlcs
- Advertisement -

తెలంగాణలో ఎమ్మెల్సీ పదవీ కోసం పోటాపోటీ నెలకొంది. నువ్వా నేనా అన్నట్లు అధికార టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన నేతలు ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలతో పాటు మార్చిలో ఖాళీ కానున్న 9 స్ధానాల్లో కర్చిఫ్‌ వేసేందుకు ముమ్మర ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు నేతలు. ఇందులో కొంతమంది తాజా సభ్యులు మళ్లీ రేసులో ఉండగా గత ఎన్నికల్లో ఓడిపోయిన మంత్రులు,అధిష్టానం హామీ ఇచ్చిన నేతలు ఉన్నారు.

మొత్తం 40 మంది సభ్యులున్న మండలిలో శాసనసభ రద్దు నాటికి టీఆర్ఎస్‌కు 31 స్థానాలు, కాంగ్రెస్‌కు 7, మజ్లిస్‌, బీజేపీలకు ఒక్కో స్థానం చొప్పున ఉండేవి. మార్చి నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్న ఎమ్మెల్సీల్లో మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ ,పాతూరి సుధాకర్‌రెడ్డి ,పూల రవీందర్‌ , మహమూద్‌ అలీ, షబ్బీర్‌అలీ, టి.సంతోష్‌కుమార్‌, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మహ్మద్‌ సలీంతోపాటు ఎంఎస్‌ ప్రభాకర్‌రావు ఉన్నారు.

వీరిలో మహమూద్ అలీకి హోంమంత్రి పదవీ దక్కడంతో ఆయన మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికవడం లాంఛనమే. ఇక మండలి ఛైర్మన్‌ స్వామి గౌడ్‌కు చేవెళ్ల ఎంపీ లేదా మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు మాజీ స్పీకర్‌ సురేష్ రెడ్డి సైతం ఎమ్మెల్సీ పదవీ ఆశీస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల్లో ఓడిపోయిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పట్నం మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు తమకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి, మంత్రులుగా నియమించాలని కోరుతున్నారు. మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చి మండలి ఛైర్మన్‌ పదవి ఇవ్వాలని అభ్యర్థిస్తున్నట్లు సమాచారం. ఆసిఫాబాద్‌లో ఓడిపోయిన కోవా లక్ష్మి మహిళా కోటాలో స్థానం ఆశిస్తున్నారు.

ఇక ఎమ్మెల్సీ పదవీ ఆశీస్తున్న వారిలో గుర్నాథ్‌రెడ్డి (కొడంగల్‌), సుధీర్‌రెడ్డి (మేడ్చల్‌), బస్వరాజ్‌ సారయ్య, గుండు సుధారాణి (వరంగల్‌ తూర్పు), మండల శ్రీరాములు (జనగామ), సత్యవతి రాథోడ్‌ (డోర్నకల్‌), కవిత (మహబూబాబాద్‌), ఎడ్మ కిష్టారెడ్డి (కల్వకుర్తి), సుధాకర్‌రావు (పాలకుర్తి), చందర్‌రావు, శశిధర్‌రెడ్డి (కోదాడ), నందకిశోర్‌ వ్యాస్‌ బిలాల్‌ (గోషామహల్‌), శ్రీహరిరావు (నిర్మల్‌) ఉన్నారు. మొత్తంగా అధికారపార్టీలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం అప్పుడే ప్రారంభమైంది.

కాంగ్రెస్‌లో చేరిన నలుగురు ఎమ్మెల్సీలపైనా టీఆర్ఎస్ ఫిర్యాదు చేయగా, మండలి ఛైర్మన్‌ వారికి నోటీసులు ఇచ్చారు. వారి సభ్యత్వాలు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో మొత్తంగా 16 స్థానాలూ ఒకటి గవర్నర్‌ కోటా, 7 శాసనసభ్యుల కోటా, 5 స్థానిక సంస్థల నియోజకవర్గాలవి, ఒకటి పట్టభద్ర, 2 ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో పాగా వేసేందుకు టీఆర్ఎస్‌ కసరత్తు చేస్తోంది.

- Advertisement -