ఏం జరిగిన ప్రజాస్వామ్యబద్దంగా జరగాలి- కేకే

295
kk
- Advertisement -

వ్యవసాయ బిల్లులు ఆమోదం ఢిల్లీలో పార్లమెంట్‌ వద్ద టిఆర్ఎస్ ఎంపీల ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కే కేశవరావు,ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంపీ వెంకటేష్ నేత పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కే కేశవరావు మాట్లాడుతూ.. వ్యవసాయ బిల్లులు ఆమోదం రాజ్యాంగానికి, రూల్స్ కు ఉందని 14 పార్టీలు చెప్పాయి. 252 రూల్ ప్రకారం ఓటింగ్, డివిజన్ ఓటింగ్ అడిగితే ఆర్డర్ ఇచ్చామన్నారు. బిల్లు ఆమోద సమయంలో జరిగినట్టుగానే ఇవ్వాళ కూడా తప్పుడు సంకేతాలతోని సభ్యులను సస్పెన్షన్ చేశారు. సస్పెన్షన్ అయిన సభ్యుల ధర్నాకు సంఘీభావం తెలిపాము అన్నారు కేకే.

ప్రతిపక్ష నాయకుడికి రేపు మాట్లాడే అవకాశం ఇస్తారేమో చూస్తున్నాం. అన్ని పార్టీల వారందరం రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేస్తున్నాం. రాజ్యాంగంలో రూలింగ్ ఇవ్వడానికి ఒక్క సుప్రీంకోర్టుకు మాత్రమే అధికారం ఉంది. అవిశ్వాస తీర్మానం ఇస్తే 14 రోజుల ముందు ఇవ్వాలని అంటున్నారు. కానీ రూల్స్ ప్రకారం అలా లేదు. ఏం జరిగిన ప్రజాస్వామ్యబద్దంగా జరగాలని కోరుకుంటున్నాం. వ్యవసాయ బిల్లులను ఎందుకు వ్యతిరేకిస్తున్నామో అందరికి తెలుసు అని కేకే తెలిపారు.

ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ.. అందరూ నిన్న బిల్లు ఆమోదించిన తీరు చూసి బ్లాక్ డే అంటున్నారు. వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్ష పార్టీలను మాట్లాడించి ఒప్పించాల్సింది. మూజువాణి ఓటుతో బిల్లులను ఆమోదించే అవసరం ఎందుకు వచ్చింది రంజిత్‌ రెడ్డి ప్రశ్నించారు. ఈ బిల్లులతో బిజెపి పాలిత రాష్ట్రాలు కూడా సంతోషంగా లేవు. వాస్తవంగా కనీస మద్దతు ధర ఇస్తున్నది ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమే. 8లక్షల టన్నుల మొక్కజొన్నను 17.20పైసలకు కొన్నది. బీహార్ లో ఇప్పుడు 10 రూపాయలకు అమ్ముతున్నారని తెలిపారు.

అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వండి.అలా చేస్తే అన్ని పార్టీలు మద్దతు తెలుపుతాయి. బిజెపీ ఎంపీలు ఏఎంసిల ద్వారా 10వేల కోట్లు వసూలు చేస్తున్నారు అంటున్నారు. కానీ గడచిన మూడు సంవత్సరాల అధికారిక లెక్కలు తీస్తే 346 కోట్లు మాత్రమే. మోడీ దృష్టిలో రైతు రాజు అయితే సీఎం కెసిఆర్ ప్రవేశ పెట్టిన పథకాలను కేంద్రం ఎందుకు అమలు చేయడం లేదు. రైతులను బాగు చేయాలా లేక కార్పొరేట్లను బాగుచేస్తారా..పంట విస్తీర్ణం పెంచే దిశగా ప్రధాని మోడీ ఆలోచన చేయాలని ఎంపీ రంజిత్ రెడ్డి పేర్కొన్నారు.

ఎంపీ వెంకటేష్ నేత మాట్లాడుతూ.. రాజ్యసభ లో వ్యవసాయ బిల్లులు ఆమోదించిన రోజు చీకటి రోజు. రాష్ట్రాల సబ్జెక్టులను కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలనే ఉద్దేశ్యంతో వ్యవసాయ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించారు. తెలంగాణ కాంగ్రెస్, బిజెపి ఎంపీలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు భాంధావుడు అని వెంకటేష్‌ అన్నారు. రైతు బాగుండాలని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. తాజాగా రెవెన్యూ చట్టాన్ని ఆమోదించి దేశానికి తెలంగాణాని ఆదర్శంగా నిలిపారు.

రైతుల స్వయం సమృద్ధి కోరుకుంటే తెలంగాణ బిజెపి ఎంపీలు రాజీనామా చేయాలి. బిల్లును వ్యతిరేకిస్తూ ఎన్డీయే మిత్రపక్ష నేత హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్ర కేబినెట్ నుండి తప్పుకున్నారు. బిల్లులను వివక్ష పూరితంగా మూజువాణి ఓటుతో ఆమోదిస్తున్నారు. మోడీ గారి కార్పొరేట్ దోపిడీ గా మారింది. రైతులు పండించిన పంటను కార్పొరేట్లకు దోచి పెడుతున్నారు. యావత్ రైతులు అన్ని గమనిస్తున్నారు తగిన సమయంలో బుద్ధి చెప్తారు. తెలంగాణ ప్రజలు, రైతుల అభివృద్దే టిఆర్ఎస్ పార్టీ మాట అని వెంకటేష్‌ నేత స్పష్టం చేశారు.

- Advertisement -