నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఆందోళనలో ఘట్కేసర్ మండల టిఆర్ఎస్ ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన ఆందోళనలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటం ఉన్న టిఆర్ఎస్ జెండాను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు సంఘీభావం తెలిపేందుకు ఇక్కడకు వచ్చి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నట్లు సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. వ్యవసాయంపై పూర్తి అధికారాలు రాష్ట్రాలకు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.
కేంద్రం కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషించడం సరైన పద్ధతి కాదని ఎంపిపి ఏనుగు సుదర్శన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర రైతులకు చేస్తున్నా అభివృద్ధి పథకాల గురించి ధర్నాలో పాల్గొన్న రైతులకు వివరించినట్లు తెలిపారు. రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమా పథకాలను ఇతర కార్యక్రమాలను వివరించినట్లు ఎంపిపి సుదర్శన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగానికి చేస్తున్న కృషి పట్ల ధర్నాలో పాల్గొన్న రైతులు హర్షం వ్యక్తం చేసినట్లు చెప్పారు.