రెండు దశల్లో గ్రేటర్‌ ఓట్ల లెక్కింపు- ఎస్‌ఈసీ

76
C-Parthasarathi-IAS

శుక్రవారం గ్రేటర్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో జిహెచ్‌ఎంసి పరిధిలోని 30 సర్కిళ్ళకు 30 మంది కౌంటింగ్ పరిశీలకులను నియమించడం జరిగిందని, తమకు కేటాయించిన పరిధిలోని అన్ని వార్డులకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను వారు పర్యవేక్షి౦చాలన్నారు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ సి పార్థసారధి. గురువారం (3-12-2020) మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ కాన్ఫెరెన్స్ హాల్‌లో ఎన్నికల పరిశీలకులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఈసీ మాట్లాడుతూ.. ప్రతి కౌంటింగ్ హాల్ లో 14 టేబుల్స్ ఉంటాయని, హాల్ చిన్నగా ఉన్నందున 16 వార్డులలో 7 టేబుళ్ళ చొప్పున రెండు కౌంటింగ్ హాల్స్ కు అనుమతిస్తూ అట్టి రిటర్నింగ్ అధికారులకు, అదనపు రిటర్నింగ్ అధికారులను కేటాయించడం జరిగిందన్నారు.

కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ పూర్తయి౦దని, కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలకులు ఈరోజు పరిశీలించాలని సూచించారు. మొదట పోస్టల్ బ్యాలెట్ పేపర్ల లెక్కింపు రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద 8.00 గంటలకు ప్రారంభించాలని, అదే సమయంలో ప్రాధమిక లెక్కింపు కౌంటింగ్ టేబుళ్ళ వద్ద 8.10 నిమిషాలకు ప్రారంభించాలని తెలిపారు. కౌంటింగ్ రెండు దశలలో జరుగుతుందని మొదటి దశలో బ్యాలెట్ బాక్స్ లలోని బ్యాలెట్ పేపర్లను మడత విప్పకుండా లెక్కిస్తారని, తర్వాత బండిళ్ళను కలిపి అభ్యర్ధి వారిగా లెక్కిస్తారని తెలిపారు.

సందేహాత్మక బ్యాలెట్లను రిటర్నింగ్ అధికారి పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని, రిటర్నింగ్ అధికారి నిర్ణయం తుది నిర్ణయం అన్నారు. ప్రతి వార్డు లెక్కింపు పూర్తయన తర్వాత రిటర్నింగ్ అధికారి పరిశీలకుని అనుమతి పొందిన తర్వాతనే రిజల్ట్ ప్రకటించాలి. మొత్తం కౌంటింగ్ సిబ్బంది 8152, ఒక్కో రౌండుకు 14000 ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని, ఉదయం 8.00 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, ప్రతి టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారన్నారు. 74 లక్షల 67,256 మంది ఓటర్లకు గాను 34 లక్షల 50 వేల 331 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని, 1926 పోస్టల్ బ్యాలట్లు జారీ చేశారన్నారు. అధికారులతోపాటు కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తప్పక మాస్క్ ధరించాలని, అన్ని కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని అన్నారు.