లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై టిఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు మాట్లాడారు. అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రమే ఆదర్శంగా ఉందని..రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొన్న పలు సంక్షేమ పథకాలను తెలంగాణలో ముందుగానే ప్రవేశ పెట్టి, విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత ఒక్క సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది అన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అనేక సంక్షేమ పథకాల అమలులో అగ్రభాగాన ఉంది. ముఖ్యంగా రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే దిక్చూదిగా, మార్గదర్శిగా ఉన్నారు. రైతు బంధు, రైతు భీమా, రైతు వేదికలు లాంటి వినూత్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ. గత సంవత్సర కాలంగా కోవిడ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటువంటి క్లిష్ట సమయంలో కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంది. ప్రపంచ మొత్తం భారత దేశం వైపు చూస్తుందన్నారు నామా.
డాక్టర్లు, హెల్త్ వర్కర్లు, సఫాయి కార్మికులు, పోలీసులు అంతా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సమస్యను సమిష్టిగా ఎదుర్కొన్నాం. ప్రధానమంత్రితో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోవిడ్ నియంత్రణకు చాలా బాగా పని చేశారు. కోవిడ్ సమయంలో ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఫ్లోర్ లీడర్లతో మాట్లాడడంతో పాటు ఫార్మా కంపెనీలను స్వయంగా సందర్శించి, వ్యాక్సిన్ తయారీ గురించి మాట్లాడడం జరిగింది. దేశ ప్రజలు గర్వపడే విధంగా భారత్ వ్యాక్సిన్‌ను తయారు చేసింది.తెలంగాణలోని హైదరాబాద్ లో వ్యాక్సిన్‌ను తయారు చేయడం ఎంతో గర్వంగా ఉంది.పేదలందరికీ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలి.80 శాతం మంది సన్న కారు రైతులున్నారని, వారికి కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద 1 లక్షా 13 వేల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారని తెలిపారు నామ నాగేశ్వరరావు.
రైతులకు పెట్టుబడి సాయం అందించాలని దేశంలో మొట్టమొదటిగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచన చేశారు.రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నారు.రైతు బంధు పథకం ద్వారా 2018 – 19 ఆర్ధిక సంవత్సరం నుంచి రైతులకు పెట్టుబడి సాయం అందజేయడం జరుగుతుంది.ఇప్పటి వరకు రూ .39 వేల కోట్లను పెట్టుబడి సాయంగా నేరుగా రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగింది. ఇది ఎంతో సంతోషంగా ఉంది.తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని కేంద్రం దేశ వ్యాప్తంగా అమలు చేయడం తమకెంతో గర్వంగా ఉంది. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ గా ఒక్కోక్క క్లస్టర్ లో 1500 నుంచి 2 వేల వరకు రైతులు ఉంటారు.ఒక క్లస్టర్ కు ఒక్కో రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నాం. రైతులు ఒక చోట చేరి, సాగు విధానం, వాతావరణ పరిస్థితులు, భూసార పరీక్షతో పాటు ఇతర సమస్యలు చర్చించుకునేందుకు రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడుతున్నయి. సన్నా , చిన్నకారు రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంటుంది.ఈ రైతు వేదికల్లో ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుని చర్చించుకోవడంతో పాటు ఎరువులు, రైతులకు సంబంధించిన ఉత్పత్తులు అమ్ముకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. తెలంగాణ మాదిరిగా దేశంలో కూడా రైతు వేదికలు ఏర్పాటు చేయాలని సభలో కేంద్రాన్ని కోరారు ఎంపీ నామ నాగేశ్వరరావు.
దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం ఒక్కటే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. అన్నదాతల సమస్యలను సహృదయంతో అర్ధం చేసుకుని ప్రధాని పరిష్కరించాలి. బాపూజీ కన్న కలలు సాకారం చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం. సీఎం కేసీఆర్ తెలంగాణలో పల్లె ప్రగతి,పట్టణ ప్రగతి పథకాలు అమలు చేస్తూ గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేస్తున్నారు. కేంద్రం నుంచి వచ్చిన ప్రతినిధి బృందం కూడా వచ్చి తెలంగాణలోని పల్లె ప్రగతి కార్యక్రమాని పరిశీలించడం జరిగింది. సీఎం కేసీఆర్ గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేయడం ప్రారంభించారని చెప్పారు. నా చిన్నప్పుడు పల్లెల్లో శవాలను రోడ్లు, డొంకల్లో దహనం చేయటం చూసానని కాని నేడు ఆ ఇబ్బందుల లేకుండా సీఎం కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా వైకుంఠదామాలు ఏర్పాటు చేస్తున్నారు. నేనూ ఒక రైతు బిడ్డను.. చిన్నప్పుడు ఈ పరిస్థితి కళ్లారా చూశాను. ఇప్పుడు సీఎం కేసీఆర్ ముందు చూపు వల్ల ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు గ్రామ గ్రామాన వైకుంఠ దామాలు నిర్మిస్తున్నారు. అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ నర్సరీలు ఏర్పాటు చేశారు.ప్రతి గ్రామానికి ట్రాక్టర్, వాటర్ ట్యాంకర్ కూడా ఇవ్వడం జరిగిందని నామా వివరించారు.
తెలంగాణ అమలు చేస్తున్న చాలా పథకాలను నేడు కేంద్రం ఆదర్శంగా తీసుకుని , వివిధ రాష్ట్రాల్లో అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నది.అలాగే పల్లె ప్రగతి పథకాన్ని కూడా దేశ వ్యాప్తంగా అమలు చేయాలి.. తద్వారా దేశ వ్యాప్తంగా గ్రామాల అభివృద్ధి జరగుతుంది. బి.ఆర్.అంబేద్కర్ కోరుకున్న విధంగా సీఎం కేసీఆర్ ప్రతి పల్లె, ఇంటింటికి స్వచ్చమైన తాగు నీరు ఇవ్వాలని ఆకాంక్షించారు.తెలంగాణను చూసే హ గర్ జల్ పథకాన్ని కేంద్రం తీసుకు వచ్చింది. ఇది మంచి పరిణామం … మా నాయకుడు కేసీఆర్ తెలంగాణలో ముందే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తప్పనిసరిగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో మహిళలకు కల్యాణ లక్ష్మీ , షాదీముబారక్ పథకాల ద్వారా ఎస్.సి. , ఎస్.టి , బీసీ మహిళలకు ఒక లక్షా 116 ల ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నాం. ఇప్పటివరకు తెలంగాణలో 8 లక్షల మందికి 6 వేల కోట్లు అందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న విభజన హామీలను నెరవేర్చాలి. బయ్యారం స్టీల్ ప్లాంట్, ఇండియన్ ఇన్‌స్ట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ ( ఐ.ఐ.ఎం ) సంస్థ ఏర్పాటు చేయాలి. నూతన ఎయిర్ పోర్టు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రీజినల్ రింగ్ రోడ్ , గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటుతో పాటు తెలంగాణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఒక్కో జిల్లాలో ఒక నవోదయ కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఎంపీ నామ నాగేశ్వరరావు కేంద్రాన్ని కోరారు.