తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా నేడు పార్లమెంట్ లో మాట్లాడారు ఎంపీ నామా. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగాణలో పల్లెల అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70ఏండ్లు గడుస్తున్నా ఇంకా పల్లెలు అభివృద్ది చెందలేదన్నారు. గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.
మిషన్ భగీరథ ద్వారా గత నాలుగేళ్ల నుంచి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి నీళ్లు అందిస్తున్నామన్నారు. భగీరథ స్పూర్తితోనే కేంద్రం జల్‌జీవన్ మిషన్‌ను ప్రారంభించిందన్నారు. తెలంగాణలో రైతు బంధు పేరిట ప్రతి ఏకరానికి ఏడాదికి రూ.10వేలు ఇస్తున్నట్లు తెలిపారు. జాతిపిత మహాత్మ గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజం చేసి చూపించారన్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికి సురక్షిత త్రాగునీటిని అందిస్తున్నట్లు తెలిపారు.