దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్షాలపై కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శంచారు. రంగారెడ్డి ఎలిమనేడులో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి నాలుగు రోజులుగా సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డితో పాటు కవిత యాగానికి హాజరయ్యారు. అనంతరం విలేకరులతో కవిత మాట్లాడారు. బీజేపీ తనపై చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమన్నారు. తాను మానసికంగా కుంగిపోతానని అనుకుంటున్నారన్నారు. బట్టకాల్చిమీద వేయడం బీజేపీ పని.. అని విమర్శించారు.
ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం.. ఎవరికీ భయపడేది లేదన్నారు. బిల్కిస్ బానో, ఇతర అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. బిల్కిస్ బానో, ఉద్యోగాలు లాంటి విషయాలపై జవాబు చెప్పకుండా, ప్రతిపక్షాల మీద ఇలాంటి ఆరోపణలతో బురద చల్లాలనే వైఖరి బాగాలేదు.. దీన్ని ప్రజలంతా గమనించాలన్నారు. కేంద్రంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో నాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు. కేసీఆర్ బిడ్డను బద్నాం చేస్తే కేసీఆర్ భయపడుతారేమో అని చూస్తున్నారని, ఇది వ్యర్థ ప్రయత్నమే తప్ప ఇలాంటి వాటికి కేసీఆర్ భయపడరన్నారు. ఏ విచారణకైనా కేంద్రం చేసుకోవచ్చని చెప్పారు. ఎంత ఒత్తిడి చేసినా వెనక్కి తగ్గేది లేదని పేర్కొన్నారు. కేసీఆర్‌ను మానసికంగా వేధించాలంటే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరన్నారు.
నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఉద్యమ సమయంలోనూ కేసీఆర్‌పై అనేక ఆరోపణలు చేశారని, మొక్కవోని దీక్షతో సీఎం కేసీఆర్ ఉద్యమాన్నినడిపించారన్నారు. మొక్కవొని ధైర్యంతో, మడమ తిప్పకుండా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన వ్యక్తులమన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని, భారతదేశం ఎలా అభివృద్ధి చెందాలి అనే కలతో, ఎజెండాతో సీఎం కేసీఆర్ ముందుకెళ్తున్నారు.