‘ఆ నలుగురు’ దేశానికి పట్టిన దరిద్రం- ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

102
- Advertisement -

ఇందూరు గడ్డపై గత కొన్నాళ‌్లుగా అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య జరుగుతున్న పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరుకుంటోంది. ఇస్సాపల్లిలో బీజేపీ ఎంపీ అర్వింద్‌‌ను పసుపు రైతులు తరమికొట్టిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో రాజకీయ సెగలు రగులుతున్నాయి. కాగా ఇస్సాపల్లి ఘటనపై బీజేపీఎంపీ అర్వింద్‌తో మాటల తూటాలు పేలుతున్న టైమ్‌లో గులాబీ బాస్ , సీఎం కేసీఆర్ అనూహ్యంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించారు. దీంతో గులాబీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది. సీఎం కేసిఆర్ పుట్టినరోజు సంధర్భంగా ఫిబ్రవరి 17న నిజామాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు జిల్లానేతలు పాల్గొన్నారు. మరోవైపు జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన జీవన్ రెడ్డి మొదటిసారిగా జిల్లాకు చేరుకోవడంతో కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

ఈ సంధర్బంగా ఏర్పాటు చేసిన సభలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు. ధర్మపురి అర్వింద్‌ ఫేక్‌ అండ్‌ ఫ్రాడ్‌ ఎంపీ అంటూ విరుచుకుపడ్డారు.. పసుపు బోర్డు 5 రోజుల్లో తెస్తానని బాండ్‌ పేపర్‌ రాసిచ్చిన దొంగ ఎంపీ అని అర్వింద్‌పై మండిపడ్డారు. నిజామాబాద్ గడ్డ కేసీఆర్ అడ్డా అంటూ జీవన్ రెడ్డి వీరావేశంతో డైలాగ్ పేల్చారు. పాతకాలంలో ఆర్మూర్ టైగర్‌గా బాజిరెడ్డి గోవర్ధన్ ఉండేవారు… ఇప్పుడు నాకు కత్తి, ఖడ్గం ఇచ్చారు.. ఇగ నుంచి సీఎం కేసీఆర్ గురించి కాని, మా కేటీఆర్, మా కవిత గురించి కాని మా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల గురించి మీ వాట్సాప్ యూనివర్సిటీలో ఇష్టం వచ్చినట్లు వాగితే….దంచుడే అని హెచ్చరించారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్, రేవంత్ రెడ్డి అనే నలుగురు దేశానికి పట్టిన దరిద్రం.. దేశానికి రాష్ట్రానికి పట్టిన శని అని జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు.

ముఖ్యమంత్రి పుట్టినరోజు గురించి రేవంత్ రెడ్డి మాట్లాడ‌డం సిగ్గుచేటు అని జీవన్ రెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఇస్తున్న రైతు బంధు తీసుకున్న రైతులందరూ మా సార్ బర్త్‌డే చేస్తున్నారు.. దరిద్రులు రేవంత్ రెడ్డి, అరవింద్ కు ఎవరైనా ఇలా చేశారా అని ఆయన ప్రశ్నించారు.. బిడ్డా.. ఆట మొదలైంది..ఒళ్ళు దగ్గర పెట్టుకోండి జాగ్రత్త అని బీజేపీ, కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. మాకు 63 లక్షల సైన్యం ఉంది.. తెలంగాణ గాంధీ.. దేవుడు సీఎం కేసీఆర్ గురించి తప్పుగా మాట్లాడితే.. ఇక దంచుడే అని కాంగ్రెస్, బీజేపీ నేతలను హెచ్చరించారు.. మొత్తంగా సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులపై అవాకులు చెవాకులు పేల్చుతున్న బండి బ్యాచ్, రేవంత్‌ గ్యాంగ్‌లకు జీవన్ రెడ్డి ఇచ్చిన సీరియస్ వార్నింగ్ ఇప్పుడు నిజామాబాద్‌లో సంచలనంగా మారింది.

- Advertisement -