నేరస్తుల అడ్డా బీజేపీ గడ్డ- ఎమ్మెల్యే బాల్క సుమన్‌

251
MLA Balka Suman
- Advertisement -

దేశాన్ని అభివృద్ధిలో ముందు నిలబెట్టమంటే దేశ ప్రజలను రోడ్డు మీద నిలబెట్టారు ప్రధాని నరేంద్రమోదీ అని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే బాల్క సుమన్‌ విమర్శించారు. శనివారం శాసనసభ ఆవరణలోని టీఆర్‌ఎస్‌ ఎల్పీ కార్యాలయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావుతో కలిసి బాల్క సుమన్‌తో మీడియాతో మాట్లాడారు. బీజేపీ అంటేనే అమ్మకం పార్టీ అని దుయ్యబట్టారు. విదేశాల నుంచి నల్లధనం తీసుకొస్తామని కేంద్రం మోసం చేసిందని విమర్శించారు. కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడే బీజేపీలోనే అనేక మంది వారసులు ఉన్నారని.. పదవుల కోసం పెదవులు మూసుకుని గుజరాతీలకు గులాంగా కిషన్‌ రెడ్డి మారాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతులకు వ్యతిరేకంగా నల్లచట్టాలను తెచ్చిందని, రైతు బిడ్డగా చెప్పుకునే కిషన్‌ రెడ్డి.. ఎనిమిది నెలలుగా ఢిల్లీ శివార్లలో రైతులు ఆందోళన చేస్తున్నా నోరు మెదపడం లేదని విమర్శించారు. తెలంగాణకు ఏం చేస్తారో కిషన్‌ రెడ్డి చెప్పాలని డిమాండ్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీహెచ్‌ఈఎల్‌కు రూ.25 వేల కోట్ల కాంట్రాక్టులు ఇచ్చిందని, కేంద్రం మాత్రం ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతున్నదని చెప్పారు. ప్రజల ఆస్తులను అంబానీ, అదానీలకు కేంద్రం కట్టబెడుతున్నదని ఆరోపించారు. ప్రధాని మోదీకి ఫొటో తిప్పలు తప్ప పేదల పాట్ల తిప్పలు పట్టడం లేదని విమర్శించారు.

ప్యాకేజీల పేర్లతో కేంద్రం ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెడుతున్నదన్నారు. కేంద్రం ఏడేండ్లలో 14 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలనీ.. అవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. సామాన్యులను కూడా వదకుండా కేంద్ర ప్రభుత్వం భారాలు మోపుతున్నదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను బీజేపీ సర్కార్‌ కాపీ కొడుతున్నదని వెల్లడించారు. నేరస్తుల అడ్డా బీజేపీ గడ్డ అని, ఇతర పార్టీల్లోని నేరస్తులను బీజేపీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్‌ హుజూరాబాద్‌లో గెలిచే అవకాశమే లేదని, అక్కడ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ గెలుపు ఎప్పుడో ఖాయమయిందని బాల్క స్పష్టం చేశారు.

- Advertisement -