గవర్నర్‌కు విన‌తిప‌త్రం అందించిన టీఆర్ఎస్ నేత‌లు..

128
- Advertisement -

కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా చేపట్టిన తెలిసిందే. కాగా ఈ ధర్నా ముగిసిన అనంతరం టీఆర్ఎస్ నేతలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో రాజ్ భవన్‌కు తరలివెళ్లారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ధాన్యం కొనుగోలుపై తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వారు ఆమెకు అందజేశారు.

యాసంగి వరి సాగు, వరి ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర్ రాజ‌న్‌ను టీఆర్ఎస్ ప్రజాప్ర‌తినిధులు కోరారు. గవర్నర్‌ను కలిసిన వారిలో మంత్రులు నిరంజన్ రెడ్డి, హరీష్ రావు, మహమూద్ అలీ, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి,గంగుల కమలాకర్ ఉన్నారు.

ధర్నాతో కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వ వైఖరి స్పష్టం చేశాం. కేంద్ర ప్రభుత్వ అసంబద్ధ విధానాల మూలంగా తెలంగాణ ప్రభుత్వానికి ధర్నా చేయక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ఉద్యమమే రైతులు, వాళ్ల సమస్యల చుట్టూ తిరిగింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలతో రైతులు సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్ర గవర్నర్ గా ఇది మీరు సంతోషించాల్సిన అంశం అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సహకారం అందిస్తున్నప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం ప్రతి విషయంలో రైతులను అయోమయానికి గురిచేస్తుంది. రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చే తెలంగాణ ప్రభుత్వం వారికి నష్టం కలిగితే ఎంత పెద్ద పోరాటానికైనా సిద్దం అని టీఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు.

- Advertisement -