ఉద్యమ సమయంలో ఉద్యోగులంతా సీఎం కేసీఆర్ వెంటే నడిచారని…అప్పుడు ఇప్పుడు ఎల్లప్పూడు ఆయన వెంటే ఉంటారని తెలిపారు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి. నల్లగొండ పట్టభద్రుల సమావేశంలో మాట్లాడిన పల్లా..రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి సీఎం కేసీఆర్ న్యాయం చేశారని తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇతర రాష్ట్రాలకంటే ఎక్కువ పీఆర్సీ ఇచ్చామని… పీఆర్సీకి ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మతించారని తెలిపారు. ఉపాధ్యాయులు ఫిట్‌మెంట్, బదిలీలు, ప్రమోషన్లు అడిగారని వారికి కూడా వంద శాతం న్యాయం జరుగుతుందని చెప్పారు. త్వరలో మరో 60 వేల ఉద్యోగాలకు సంబంధించిన నియామక ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని, యాదాద్రి పవర్‌ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నామని, దండు మల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ఏప్రిల్ 1 నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగులకు కొత్త పథకం ప్రారంభిస్తామన్నారు. ఈనెల 14న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరు తనకు మొదటి ప్రాధాన్యతా ఓటువేసి మరోమారు గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.