టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఎమ్మెల్యేగా గెలుపు పత్రాన్ని అందుకున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో సిట్టింగ్ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ తిరిగి కైవసం చేసుకుంది. పార్టీ అభ్యర్థి నోముల భగత్ 18,804 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు జానారెడ్డి రెండో స్థానానికే పరిమితమయ్యారు. బీజేపీ అభ్యర్థి రవి నాయక్ ఏకంగా డిపాజిట్‌నే కోల్పోయారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన అనంతరం ఎమ్మెల్యేగా గెలుపు పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి నోముల భగత్‌కు అందజేశారు.
ఫలితాల అనంతరం స్థానికంగా మీడియాతో విజేత నోముల భగత్ మాట్లాడుతూ.. ఉప ఎన్నికలో గెలిపించిన ఓటర్లకు, నాగార్జునసాగర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నన్ను ఆశీర్వదించిన నాగార్జున సాగర్ ప్రజలకు నా పాదాభివందనం అని తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన టీఆర్ఎస్ శ్రేణులకు రుణపడి ఉంటానని చెప్పారు. నాన్న ఆశయాలు నెరవేరుస్తానని, అందరి సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ విజయం కేసీఆర్‌కు అంకితం అని ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తానని తెలిపారు