అల్లు అర్జున్ సాధించిన ఈ అద్భుతమైన విజయం నాకు నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు… ఆయన జాతీయ అవార్డును కైవసం చేసుకోవడంతో పాటు, ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు నటుడిగా నిలవడం గర్వంగా ఉందన్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అల్లు అర్జున్ ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా.. పాత్రలకు ప్రాణం పోయడం పట్ల ఆయన చూపే శ్రద్ధాసక్తులు, అసమానమైన అంకితభావం, అభిరుచి స్పష్టంగా తెలుసు. అతని అసాధారణమైన ప్రతిభను, నిబద్ధతను గుర్తించే మరిన్ని పురస్కారాలతో అలంకరించబడిన భవిష్యత్తు దగ్గర్లోనే ఉందన్నారు.
కమర్షియల్ సినిమా పాటలకు కొత్త అర్థం చెప్పిన దిగ్గజ స్వరకర్త ఎం.ఎం. కీరవాణి గారు ఆర్ఆర్ఆర్ వంటి స్మారక చిత్రానికి గానూ ఒకే ఏడాది అటు ఆస్కార్, ఇటు జాతీయ పురస్కారం గెలుచుకోవడం అభినందించదగ్గ విషయం అన్నారు. వెండితెరపై ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిన దృశ్యకావ్యం ఆర్ఆర్ఆర్ కి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణుడుకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.
జాతీయ అవార్డు పొందిన కాల భైరవ, శ్రీనివాస్ మోహన్, ప్రేమ్ రక్షిత్, కింగ్ సోలమన్ లకు అభినందనలు తెలిపారు. ముఖ్యంగా మన తెలుగు సినిమా కీర్తిని జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన ఎస్.ఎస్. రాజమౌళికి ధన్యవాదాలు చెప్పారు.
Also Read:దళితులపై బీజేపీకి చిన్నచూపా?
తమ తొలి చిత్రం ఉప్పెనతో జాతీయ అవార్డును గెలుచుకున్న బుచ్చిబాబు సన మరియు పంజా వైష్ణవ్ తేజ్‌లకు నా శుభాకాంక్షలు. అలాగే, నేను ఎంతగానో అభిమానించే, గౌరవించే గీత రచయిత చంద్రబోస్ గారు కొండపొలం సినిమాకు గాను జాతీయ అవార్డు అందుకున్నందుకు నా శుభాకాంక్షలు చెప్పారు. నా సోదరుడు, ఉత్సాహవంతమైన స్వరకర్త దేవిశ్రీ ప్రసాద్ జాతీయ అవార్డును గెలుచుకోవడం నాకు హృదయం సంతోషంతో నిండిన క్షణం. అతను మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను అన్నారు. మన తెలుగు చిత్ర విజేతలందరితో పాటు 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు అందుకున్న ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు చెప్పారు.
Also Read:కాంగ్రెస్ టికెట్ల అమ్మకం.. నేడే లాస్ట్!