అయోధ్యలో రాముడు పుట్టాడని హిందువులకు ఎంతటి నమ్మకం ఉందో.. ట్రిపుల్ తలాక్ అంశం కూడా అలాంటిదేనంటూ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఎఐఎమ్‌పీఎల్‌బీ) తన వాదన తెరపైకి తీసువచ్చింది. ట్రిపుల్ తలాక్ అంశంపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ మొదలైంది. వాట్సాప్ ద్వారా ఈ-డైవర్స్ ఇస్తున్న అంశంపై ముస్లిం బోర్డు ఏమంటుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి కపిల్ సిబల్ సమాధానం ఇచ్చారు. ట్రిపుల్ తలాక్ 1400 ఏళ్ల ఆచారమని, అది రాజ్యాంగ విరుద్ధం ఎలా అవుతుందని ఆయన అన్నారు.
క్రీ.శ. 637 నుంచి ట్రిపుల్ తలాక్ ఉంది. ఇది ఇస్లాం వ్యతిరేకమని చెప్పడానికి మనమెవరం? ముస్లింలు గత 1400 ఏళ్లుగా ట్రిపుల్ తలాక్ విధానాన్ని పాటిస్తున్నారు. ఇది నమ్మకానికి సంబంధించిన విషయం. అందువల్ల రాజ్యాంగబద్ధత, సమానత్వం అనే ప్రశ్నే తలెత్తదన్నారు. రాముడు అయోధ్యలో జన్మించారని హిందువులు ఎలా నమ్ముతున్నారో.. అలాగే ట్రిపుల్ తలాక్‌ను కూడా ముస్లింలు విశ్వసిస్తున్నారని కపిల్ సిబాల్ అన్నారు.
ముస్లింల వివాహం నిఖానామా ద్వారా సంబంధిత పెద్దల మధ్య జరిగే కాంట్రాక్టు. విడాకులు కూడా అంతే. అప్పుడు వివాహాలు లేదా విడాకుల విషయంలో మిగతా వాళ్లకు వచ్చిన బాధేంటి? అని ప్రశ్నించారు. ట్రిపుల్ తలాక్ ప్రస్తావన ‘హదిత్’ (మహ్మద్ ప్రవక్త ప్రవచనాలు)లో కనిపిస్తుందని, మహ్మద్ ప్రవక్త కాలం తర్వాత ఇది అమల్లోకి వచ్చిందన్నారు కపిల్.చీఫ్ జస్టిస్ ఖేహర్ నేతృత్వంలో అయిదుగురు సభ్యుల ధర్మాసనం ట్రిపుల్ తలాక్‌పై విచారణ చేపడుతున్న విషయం తెలిసిందే.