సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు: ట్రెసా

220
kcr

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రెవెన్యూ చట్టానికి తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ కుమార్, నాయకులు మన్నె ప్రభాకర్, రామకృష్ణ, బాణాల రాంరెడ్డి, దేశ్యా నాయక్, నాగమణి, వాణిరెడ్డి, శైలజ, మాధవి, పల్నాటి శ్రీనివాస్ రెడ్డి, నిరంజన్ తదితరులు ముఖ్యమంత్రిని కలిసి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. చట్టం అమలులో ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో సహకరిస్తామని ప్రకటించారు. కొత్త రెవెన్యూ చట్టంతో ప్రజలకు మరింత మేలైన సేవలందుతాయని వారు పేర్కొన్నారు. తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించినందుకు సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలకు మేలైన సేవలందించి ముఖ్యమంత్రి తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని అన్నారు.

రాష్ట్రంలో భూ పరిపాలన కమిషనర్ (సీసీఎల్ఏ) పోస్టును భర్తీ చేయాలని, అర్హులైన వీఆర్వోలను రెవెన్యూశాఖలోనే కొనసాగించాలని, అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని కోరారు. రెవెన్యూశాఖలో ఖాళీలను భర్తీ చేసి, సిబ్బందిని పెంచాలని, కంప్యూటర్ ఆపరేటర్లను రెగ్యులరైజ్ చేయాలని, రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించడానికి ముందు తహసీల్దార్లతో ప్రత్యేకంగా సమావేశం కావాలని వారు కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సీఎస్ సోమేశ్ కుమార్, సెక్రటరీ స్మితా సభర్వాల్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు.