రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, సినీ, వర్తక, వాణిజ్య ప్రముఖులు ముందుకు వస్తున్నారు. వరద బాధితులకు సహాయార్థంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు చెరో కోటి రూపాయలను విరాళంగా ప్రకటించారు. వీరితో పాటు నాగార్జున రూ.50లక్షలు, జూనియర్ ఎన్‌టీఆర్ రూ.50లక్షల, విజయ్ దేవరకొండ రూ.10లక్షలు, దర్శకుడు హరీష్ శంకర్ ఐదు లక్షల విరాళం ఇచ్చారు. మరికొంత మంది సినీ ప్రముఖులు సైతం ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంతకు ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 15 కోట్ల రూపాయల సాయం ప్రకటించి తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలిచారు.
రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య ప్రముఖులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. కష్టంలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ఉదారత చాటాలని కోరారు. ముఖ్యమంత్రి సహాయ (సీఎంఆర్‌ఎఫ్) నిధికి విరివిగా విరాళాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలంగాణకు తమిళనాడు తరఫున ఆ రాష్ట్ర సీఎం కె.పళనిస్వామి రూ.10 కోట్ల విరాళం ప్రకటించారు.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన చెక్కును పంపించారు. బాధిత కుటుంబాల కోసం బ్లాంకెట్లు, దుప్పట్లు పంపిస్తున్నామన్నారు. వరదల కారణంగా ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కాగా, వర్షాలు, వరదలతో నష్టపోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రా సంస్థ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. వరద బాధితులకు అండగా నిలిచి, ప్రభుత్వం చేసే సహాయక చర్యలకు తోడ్పడేందుకు ఈ విరాళం ప్రకటించినట్లు మేఘా యాజమాన్యం తెలిపింది.