సినిమా ఇండస్ట్రీలో తనదైనశైలిలో నటనను మెప్పిస్తూ విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగిపోతున్న టాలీవుడ్ క్వీన్ సమంత. సమంత ఇటివలే మయెసైటిస్ కు గురైన విషయం తెలిసిందే. అయితే తను నటించిన యశోద సినిమా ప్రేక్షకుల ముందుకు నేడు విడుదలైంది.
సమంత ఈసారి అయితే ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో ప్రయత్నం చేయటం అందరి దృష్టిని ఆకర్షించింది. సరోగసీ వెనుక జరిగే క్రైమ్ పాయింట్‌తో ‘యశోద’ సినిమా రూపొందిందని టీజర్, ట్రైలర్‌ను చూస్తే అర్థమైంది. అసలు సరోగసీ వెనుక ఎలాంటి క్రైమ్ జరుగుతుంది.. డెబ్యూ డైరెక్టర్స్ అయిన హరి, హరీష్ ఆ కోణాన్ని ఎలా ప్రెజెంట్ చేశారు? సమంత టైటిల్ పాత్రకు న్యాయం చేసిందా? లేదా? అనే విషయాలను తెలుసుకోవాలంటే ముందు కథలోకి వెళదాం..
కథ:
యశోద (సమంత) తన చెల్లెలను కాపాడుకోవటానికి సరోగసీ అమ్మగా ఉండటానికి ఒప్పుకుంటుంది. అందుకోసం ఆమెకు భారీ మొత్తం డబ్బులు ముడుతాయని ముందుగానే డీల్ కుదురుతుంది. అందులో భాగంగా మధు (వరలక్ష్మి శరత్‌కుమార్) ఆధ్వర్యంలో నడిచే సరోగసీ సెంటర్‌కు యశోద వెళుతుంది. అక్కడ తనలాగే చాలా మంది అమ్మాయిలు ఉండటాన్ని ఆమె గమనిస్తుంది. అందరూ ఏదో ఒక రకంగా తమ ఆర్థిక సమస్యను తీర్చుకోవాలనే ఉద్దేశంతో సరోగసీకి ఒప్పుకుని వచ్చారని యశోద తెలుసుకుంటుంది.
డాక్టర్‌గా ఉంటున్న గౌతమ్ (ఉన్ని ముకుందన్)తో ఆమెకు చక్కటి పరిచయం ఏర్పడుతుంది. రాను రాను అక్కడున్న అమ్మాయిలు పిల్లల్ని కనటానికి నొప్పులతో బయటకు వెళతారు. కానీ మళ్లీ కనపడరు. అవన్నీ యశోదకు అనుమానాన్ని రేకెత్తిస్తాయి. దాంతో ఆమె తన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకుందామని ప్రయత్నం చేస్తుంది. అందులో ఆమెకు తెలిసిన.. విస్తుపోయే నిజాలేంటి? నగరానికి ఆరు నెలలకోసారి ధనికులైన అమ్మాయిలు, హాలీవుడ్ తారలు ఎందుకు వచ్చి వెళుతుంటారు? వారి వెనుకున్న క్రైమ్‌కి, సరోగసీ సెంటర్‌కి ఉన్న లింకేంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
సరోగసీ (అద్దె గర్భం) అనేది వైద్య రంగం వల్ల మానవ జీవితాల్లోకి పెను మార్పులనే తీసుకొచ్చింది. చాలా మంది సంతానలేమితో బాధపడేవారు. ఆ వైద్య విధానం వల్ల తల్లిదండ్రులుగా మారి సంతోషంగా ఉన్నారు. అయితే ఇది ఓ కోణం మాత్రమే. అయితే దీనిలోని మరో కోణం.. అంటే సరోగసీ పేరుతో జరిగే క్రైమ్ కోణాన్ని ఎలివేట్ చేయడానికి యశోద చిత్రంతో ప్రయత్నం చేశారు. ఈ సినిమాకు ప్రధాన బలం సమంత. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తూ క్రేజ్ పెంచుకుంటున్న సమంత చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇది.
పెర్ఫామెన్స్ పరంగానే కాదు.. యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆమె అద్భుతంగా నటించింది. ఐదు నెలల మహిళ ఫైట్స్ తీరును హాలీవుడ్ యాక్షన్ మాస్టారు చక్కగా డిజైన్ చేశారు.
ఇక సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్‌కుమార్ స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇలాంటి పాత్రలను మించిన విలనిజాన్ని ఇది వరకే చేసిన వరలక్ష్మి శరత్‌కుమార్, యశోద సినిమాలో మాత్రం అంతకు మించి పాత్రను చక్కగా క్యారీ చేసింది. ఉన్ని ముకుందన్ పాత్రలోనూ వేరియేషన్స్‌ను ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తారు. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్, శత్రు తదితరులు వారి వారి పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతిక విషయాలకు వస్తే.. డైరెక్టర్స్ హరి, హరీష్ సరోగసీలో క్రైమ్ ఎలా ఉంటుందనే దాన్ని నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని చక్కగా తెరకెక్కించారు. సినిమాను రెండు పార్శ్వాలుగా రన్ చేస్తూ దానికి సరోగసీలోని క్రైమ్‌ని లింకు పెడుతూ ఎగ్జయిటింగ్‌గా మలిచే ప్రయత్నం చేశారు.
ఫస్టాఫ్ కొన్ని సీన్స్, సెకండాఫ్‌లో మెయిన్ కథలోని బ్రేకింగ్ పాయింట్ రివీల్ తర్వాత సినిమాను నడిపిన తీరు అద్భుతం. మణిశర్మ నేపథ్య సంగీతం, సుకుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా మారాయి. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సినిమాను చాలా రిచ్‌గా నిర్మించారు. అందుకు కావాల్సిన షూటింగ్ లోకేషన్స్ ఆర్ట్ పనితీరు చాలా బాగుంది. సినిమాపై ఆయన కున్న ప్యాషన్ తెరపై కనిపిస్తుంది.
రేటింగ్:2.5/5
ఇవి కూడా చదవండి..
యాక్షన్ సన్నివేశాల్లో..నాగ్ బిజీ
సూపర్ కాంబో మరోసారి….
డిసెంబర్ 2న…మట్టికుస్తీ విడుదల