దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ బారి నుంచి కొలుకునే వరకు కోర్టుకు రాకుండా ఇంటి నుంచే వాదనలు వినిపించాలని తెలిపింది. అత్యవసర కేసుల్ని ఇంటి నుంచే వీడియో కాల్ ద్వారా వాదించాలని పేర్కొంది. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సుప్రీం చీఫ్ జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే తెలిపారు.
న్యాయవాదులకు వీడియో కాల్ కనెక్ట్ చేసుకునేందుకు కొన్ని లింక్‌లు ఇస్తాం. వాటిని డౌన్‌లోడ్ చేసుకుని మీ వాదనలు వినిపించండి’ అని బోబ్డే తెలిపారు. ఈ రోజు సాయంత్రం నుంచి న్యాయవాదుల చాంబర్లన్నీ మూసివేస్తున్నామని, న్యాయవాదులు రేపు సాయంత్రానికల్లా ముఖ్యమైన పత్రాలు ఏమైనా ఉంటే తమ చాంబర్ల నుంచి తీసుకువెళ్లాలని సూచించారు. కాగా దేశ వ్యాప్తంగా 415 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా 75 జిల్లాల్లో ఈనెల 31వరకు లాక్ డౌన్ ప్రకటించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఈనెల 31వరకు లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఇతర రాష్ట్రాల సరిహద్దులను కూడా మూసేశారు.