తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఆల్ టైమ్ రికార్డ్ బ్రేక్ చేసింది. ప్రతి నెలా శ్రీనివాసుడి హుండీ ఆదాయం 120 కోట్లు దాటుతున్నట్లు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. అయితే టీటీడీ చరిత్రలోనే అత్యధికంగా జులై నెలలో రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. 29 రోజులకే 131 కోట్ల 76 లక్షలు రావడంతో…. గత రికార్డులను తిరగరాసి ఆల్ టైమ్ రికార్డ్ నమోదయ్యింది. ఈ ఏడాది మార్చి నెలలో శ్రీవారి హుండీ ఆదాయం 128 కోట్లు కాగా, ఏప్రిల్ లో 127 కోట్ల 5లక్షలు వచ్చిందని టీటీడీ ప్రకటించింది. మే నెలలో అత్యధికంగా 130 కోట్ల 29లక్షలు ఆదాయం వచ్చిందని తెలిపింది. గత జూన్ నెలలో 123 కోట్ల 74 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. టిటిడి వార్షిక బడ్జెట్ 3 వేల కోట్లు కాగా, ఈ ఏడాది వార్షిక హుండీ ఆదాయమే 1500 కోట్లు దాటుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు.
కరోనాతో రెండేళ్లు శ్రీవారిని దర్శించుకోలేక పోయారు భక్తులు. కరోనా తగ్గడంతో నాలుగు నెలలుగా తిరుమలకు క్యూ కడుతున్నారు. దీంతో భక్తుల రద్దీ బాగా పెరిగింది. స్వామివారి దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. రద్దీతో పాటు శ్రీవారి హుండీ ఆదాయం కూడా పెరిగింది. నగదు, నగలు వస్తు రూపంలో స్వామి వారికి ముడుపులు చెల్లించుకుంటున్నారు భక్తులు. దీంతో శ్రీవారి హుండీలో కాసుల వర్షం కురుస్తోంది. సాధారణ రోజుల్లో 3 నుండి 4 కోట్ల రూపాయలు వరకు వస్తుండగా, వీకెండ్స్, ప్రత్యేక పర్వదినాల్లో 4 నుండి 5 కోట్ల వరకు వస్తోంది. అప్పుడప్పుడు 5 కోట్ల మార్కును సైతం హుండీ ఆదాయం దాటుతోంది. దీంతో శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరిగిందని చెబుతున్నారు.