Friday, November 22, 2024
Home టాప్ స్టోరీస్ బరిలో సోనియా.. టికెట్ల ఫైట్ ?

బరిలో సోనియా.. టికెట్ల ఫైట్ ?

23
- Advertisement -

గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెడుతోంది. ఈసారి కాంగ్రెస్ పార్టీకి లోక్ సభ ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో అన్నీ రాష్ట్రాల్లోనూ సత్తా చాటలనే పట్టుదలతో ఉంది. ముఖ్యంగా తెలంగాణలో 17 స్థానాల్లో కనీసం పది స్థానాల్లో విజయకేతనం ఎగురవేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ అధినేతలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హస్తం పార్టీ అధికారంలో ఉన్నప్పటికి బి‌ఆర్‌ఎస్ పై ప్రజాభిమానం ఎక్కువగానే ఉండడంతో బి‌ఆర్‌ఎస్ నేతలతో ఢీ కొట్టే సమవుజ్జీల కోసం వెతుకులాట ప్రారంభించింది కాంగ్రెస్ అధిష్టానం.

అయితే ప్రస్తుతం ఆయా స్థానాల్లో సీట్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. నిజామాబాద్ నుంచి దిల్ రాజు, మల్కాజ్ గిరి నుంచి బండ్ల గణేశ్, భువనగిరి నుంచి తీన్మార్ మల్లన్న వంటి వారు సీటు కోసం పడిగాపులు కాస్తున్నట్లు వినికిడి. వీరితో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు లభించని కొంతమంది నేతలు కూడా లోక్ సభ సీటు కోసం కర్చీఫ్ వేసే పనిలో ఉన్నారట. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు సీట్ల కేటాయింపు తలనొప్పిగా మారే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంచితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేయించేలా రాష్ట్ర నేతలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఇదే అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. సోనియా గాంధీ తెలంగాణలో పోటీ  చేసేందుకు సుముఖత చూపితే ఖమ్మం నుంచి ఆమెను బరిలో దించే ఆలోచనలో ఉన్నారట రాష్ట్ర హస్తం నేతలు. తెలంగాణ ఇచ్చిన నేతగా సోనియా గాంధీకి ప్రజామద్దతు ఉంటుందనే భావనతో ఆమెను రాష్ట్రంలో పోటీ చేయించే విధంగా వ్యూహాలను రెడీ చేసుకుంటున్నట్లు వినికిడి. అయితే ఉత్తర ప్రదేశ్ లోని కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాయ్ బరేలీ నుంచి ఆమె గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. మరి కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న రాయ్ బరేలీని వదిలి సోనియా గాంధీ తెలంగాణలో పోటీ చేస్తారా ప్రశ్నార్థకమే.

- Advertisement -