18 ఏళ్లు దాటిన వారికి టీకా.. 24 నుంచి రిజిస్ట్రేషన్స్‌..

37
Register For Vaccine

దేశంలో సెకండ్ వేవ్ లో కరోనా తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఈనేపథ్యంలో దేశంలో మూడో విడత వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమవుతోంది. 18 ఏళ్లు దాటిన వారిందరికీ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు 45 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వగా.. మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ను వేయనున్నారు.

ఈ క్రమంలో వ్యాక్సిన్‌కు అర్హులైన వారిని ఈ నెల 24 నుంచి కొవిన్ వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవలసిందిగా కేంద్రం కోరింది. కాగా, ఇప్పటికే మన దేశంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉండగా.. త్వరలో రష్యా తయారీ ‘స్పుత్నిక్ వి’ కూడా రానుంది. వ్యాక్సినేషన్ పరిధిని పెంచిన నేపథ్యంలో ఆయా వ్యాక్సిన్ తయారీదారులు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతున్నారు. దేశంలో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ అందితే కనుక హెర్డ్ ఇమ్యూనిటీ రావడానికి ఆస్కారం ఉంటుందని వైరాలజిస్టులు పేర్కొంటున్నారు.

రిజిస్ట్రేషన్ ప్రక్రియ..

-టీకా తీసుకోవాలనుకునేవారు ముందస్తుగా కేంద్రం అధికారిక వెబ్‌సైట్‌ కొవిన్‌లో రిజిస్టర్‌ చేసుకోవలసి ఉంటుంది.
-ఆరోగ్య సేతు యాప్‌లో కూడా టీకా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వీలుంది.
-తొలుత సెర్చ్‌ ఇంజన్‌లోకి వెళ్లి cowin.gov.in లో లాగిన్‌ చేసి, మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. ఆ వెంటనే ఓ ఒటిపి నెంబర్‌ వస్తుంది. ఒటిపి ఎంటర్‌ చేయగానే..వెరిఫై బటన్‌పై క్లిక్‌ చేయాలి.
-అది ఓకే అయితే రిజిస్టేషన్‌ ఆఫ్‌ వ్యాక్సినేషన్‌ పేజ్‌ ఓపెన్‌ అవుతోంది. అనంతరం ఫోటోతో కూడిన గుర్తింపు కార్డు,పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు నమోదు చేసి, రిజిస్టర్‌ అనే బటన్‌పై క్లిక్‌ చేయాలి.
-ఒకసారి రిజిస్టేషన్‌ అయితే, టీకా వేయించుకునేందుకు తేదీని ఎంచుకునే అవకాశం ఉంటుంది. దాని నిమిత్తం పక్కనే షెడ్యూల్‌ ఆప్షన్‌ ఉంటుంది. ఇందులో మీకు టీకా వేసుకునేందుకు అనువైన సమయాన్ని ఎంచుకోవచ్చు.
-పిన్‌ కోడ్‌ ఎంటర్‌ చేసి, వెతికితే..దాని పరిధిలోకి టీకా కేంద్రాల జాబితా కనిపిస్తోంది. వాటి ఆధారంగా తేదీ, సమయాన్ని ఎంచుకుని కన్ఫర్మ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
-ఒక్క లాగిన్‌పై నలుగురికి అపాయింట్‌మెంట్‌ తీసుకోవచ్చు. అలాగే తేదీలను మార్చుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.