ఓటర్ ఐడీ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా బ్యాంక్ పాస్‌బుక్ వంటి అధికారిక పత్రాలు కలిగి ఉన్నంత మాత్రాన ఒక వ్యక్తి భారతీయ పౌరుడని చెప్పడానికి అవి ఖచ్చితమైన/అంతిమ ఆధారాలు కావు అని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ జాతీయుడిగా అనుమానిస్తూ ముర్షిదాబాద్‌లోని నిర్బంధ కేంద్రంలో (Detention Centre) ఉంచిన ఒక వ్యక్తికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.
జస్టిస్ దేబాంగ్షు బసాక్ మరియు జస్టిస్ మహమ్మద్ షబ్బార్ రషీదీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. వయస్సు మరియు బంధుత్వంలో పరస్పర విరుద్ధ ప్రకటనలు: పిటిషనర్ తన సోదరుడి కొడుకు (అల్లుడు/కజిన్) అని వాదిస్తూ నాసిర్ అనే వ్యక్తి పౌరసత్వాన్ని నిరూపించేందుకు సుమన్ మోల్లా అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. నాసిర్ తండ్రి 1980లో మరణించాడని, దాంతో తనే నాసిర్‌ను పెంచి పెద్ద చేశానని సుమన్ పేర్కొన్నారు. అయితే రికార్డుల ప్రకారం నాసిర్ వయస్సు 46 సంవత్సరాలు కాగా, సుమన్ వయస్సు 38 సంవత్సరాలు మాత్రమే ఉండటంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
విచారణ అధికారుల వద్ద సుమన్ తనను నాసిర్ కజిన్‌గా చెప్పుకోగా, కోర్టులో మాత్రం బాబాయి అని పేర్కొనడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పిటిషనర్ స్వచ్ఛమైన ఉద్దేశంతో కోర్టు ముందుకు రాలేదని స్పష్టం చేసింది. నాసిర్ తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారని, అయితే వారి సమాధులు ఎక్కడ ఉన్నాయో కూడా పిటిషనర్లు స్పష్టం చేయలేకపోయారని, దీనివల్ల డిఎన్‌ఏ పరీక్ష నిర్వహించడం కూడా సాధ్యం కాలేదని కోర్టు పేర్కొంది.
పిటిషనర్లు నాసిర్ పౌరసత్వాన్ని నిరూపించడానికి ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మరియు యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాస్‌బుక్‌లను సమర్పించారు. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం క్రింది విషయాలను స్పష్టం చేసింది. ఓటర్ ఐడెంటిటీ కార్డ్ అనేది భారత పౌరసత్వానికి అంతిమ రుజువు కాదు. అది కేవలం ఓటర్ల జాబితాలో ఒక వ్యక్తి పేరు నమోదు అయి ఉందనడానికి ఆధారం మాత్రమే..ఆధార్ కార్డ్ అనేది కేవలం నివాసానికి సంబంధించిన గుర్తింపు పత్రం తప్ప, స్వతంత్రంగా భారత పౌరసత్వాన్ని నిరూపించే ఆధారం కాజాలదు అన్నారు.
Also Read:విరాళాల చోరీ..SP ఎంపీల నిరసన

