లోక్ సభ ఎన్నికల్లో కీలకమైన మూడో దశ పోలింగ్ ప్రారంభమైంది. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 13 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, ఎస్పీ నేత ఆజంఖాన్, బీజేపీ నేత జయప్రద తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ ఎన్నికల్లో 18.56 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
గుజరాత్ (26), కేరళ (20)లోని అన్ని లోక్‌సభ స్థానాలతోపాటు, అసోం- 4, బీహార్- 5, ఛత్తీస్‌గఢ్- 7, కర్ణాటక- 14, మహారాష్ట్ర- 14, ఒడిశా- 6, ఉత్తరప్రదేశ్- 10, పశ్చిమ బెంగాల్- 5, గోవా- 2, దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యూ, త్రిపురలో ఒక్కో లోక్‌సభ సీటుకు ఈ విడుతలో ఎన్నికలు జరుగనున్నాయి.