ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు జోయా అక్తర్, రీమా కగ్తిలకు చెందిన ప్రొడక్షన్ హౌస్ ‘టైగర్ బేబీ ఫిల్మ్స్’ (Tiger Baby Films) లో దొంగతనం తెలుస్తోంది. ముంబైలోని బంద్రా ప్రాంతంలో ఉన్న ఈ నిర్మాణ సంస్థ కార్యాలయంలో సుమారు 6 లక్షల రూపాయల విలువైన ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కనుమరుగయ్యాయి. ఈ ఘటనపై నిర్మాణ భాగస్వామి అయిన రీమా కగ్తి స్పందిస్తూ.. ఇది బయటి వ్యక్తులు చేసిన పని కాదని ఆఫీస్ అంతర్గత సిబ్బంది పనే అని అనుమానిస్తున్నట్లు ధృవీకరించారు.
ఈ చోరీకి సంబంధించి ‘టైగర్ బేబీ’ ప్రతినిధులు ముంబైలోని బంద్రా పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా ఆఫీస్‌కు వస్తున్న కొందరు తాత్కాలిక లేదా కాంట్రాక్ట్ సిబ్బందిపై మేనేజ్‌మెంట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. కార్యాలయంలోని భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని, అత్యంత విలువైన డేటా ఉన్న ల్యాప్‌టాప్‌లను దొంగిలించినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Also Read:విజయన్‌కు షాక్..ఈడీ రైడ్స్!
మా ప్రొడక్షన్ హౌస్‌లో దొంగతనం జరిగిన మాట వాస్తవమే. ఇది పూర్తిగా లోపలి వ్యక్తుల పనే అని మాకు స్పష్టంగా అర్థమవుతోంది. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాం, వారు దర్యాప్తు జరుపుతున్నారు అని రీమా కగ్తి తెలిపారు. ల్యాప్‌టాప్‌లలో సినిమా స్క్రిప్ట్‌లు, ప్రాజెక్ట్ వివరాలు వంటి కీలక సమాచారం ఉండే అవకాశం ఉందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

