మానవత్వం చాటుకున్న మహిళా ఎస్‌ఐ కె.శిరీషపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడివికొత్తూరు గ్రామం పొలాల్లో ఓ గుర్తుతెలియని మృతదేహం పడివుండగా, ఆ మృతదేహాన్ని స్థానికుల సాయంతో మహిళా ఎస్‌ఐ స్వయంగా మోసుకుని తీసుకువచ్చారు. దాదాపు 2 కిలోమీటర్లు మోసుకుని రావడమే కాకుండా, అంత్యక్రియలు కూడా జరిపించారు.ఎస్‌ఐ శిరీష పొలం గట్లు, అటవీప్రాంతాలు దాటుకుంటూ ఓ స్ట్రెచర్‌పై మోసుకురావడం పట్ల సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన వస్తోంది.
ఏపీ పోలీస్ విభాగం కూడా ఎస్‌ఐ శిరీషను అభినందిస్తూ ట్వీట్ చేసింది. ఆమె వీడియోను కూడా పంచుకుంది. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆ ఫొటోలను ట్విట్టర్, ఏపీ పోలీస్ ఫేస్‌బుక్ పేజీలలో ట్యాగ్ చేసి, ‘మహిళా ఎస్‌ఐ.. మానవీయ కోణం’ అంటూ ప్రశంసించారు. ఆమెకు ప్రశంసపత్రం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. హోం మంత్రి సుచరిత సైతం ట్విట్టర్‌లో శిరీషకు అభినందనలు తెలిపారు.