ఇటీవల జరిగిన తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టియఫ్‌సిసి) ఎన్నికలు ఏకగ్రీవంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఛైర్మన్ గా డా.లయన్ ప్రతాని రామకృష్ణగౌడ్, టిఎఫ్‌సిసి వైస్ ఛైర్మన్లు గా ఎ.గురురాజ్, నెహ్రు, సెక్రటరీగా జెవిఆర్. తెలంగాణ మా
ప్రెసిడెంట్ గా రష్మి ఠాకూర్, డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా రమేష్ నాయుడు తదితరులు ఎన్నికయ్యారు. కాగా ఈ రోజు టియఫ్‌సిసి ఛైర్మన్ తో పాటు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మా
ప్రెసిడెంట్ మంచు విష్ణు అతిథులుగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు మా ప్రెసిడెంట్ మంచు విష్ణు చేతుల మీదుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. టియఎఫ్‌సిసి ఛైర్మన్ గా నాల్గవ సారి ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రతాని రామకృష్ణగౌడ్ గారికి మరియు ఇతర కమిటీ సభ్యులకు నా శుభాకాంక్షలు. ఈ సంస్థ ద్వారా ఎంతో మంది కళాకారులకు చేయూతనిస్తున్నారు. ప్రతాని రామకృష్ణ ఆధ్వర్యంలో మెంబర్స్ కు హెల్త్ కార్డులు, కరోనా సమయంలో ఎన్నో సేవాకార్యక్రమాలు చేప్పట్టడం గొప్ప విషయం అన్నారు. ప్రస్తుతం మంచి సందేశాత్మక చిత్రాలు వస్తున్నాయి. ఇక మీదట కూడా రావాలి. ఇక ఇటీవల గొప్పకళాకారులను కోల్పోతున్నాం. సాహితీ వేత్త సిరివెన్నెలగారు పరమపదించడం ఎంతో బాధాకరం. తెలంగాణ రాష్ట్రం సినిమా పరిశ్రమకు చేదోడు వాదోడుగా ఉంటూ ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ మంచు విష్ణు కూడా ఉన్నారు. వారికి కూడా చెప్పాం. అలాగే టియఫ్‌సిసి కి కూడా మా సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయి. ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేక రాష్ట్రం అయిన దగ్గర నుంచి తెలంగాణ ప్రభుత్వం అందర్నీ కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. ఇక మీదట కూడా సినిమా పరిశ్రమను ముందుకు తీసుకెళ్లడానికి శాయశక్తులా కృషి చేస్తాం అన్నారు.
మా ప్రెసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ.. ప్రతాని రామకృష్ణగౌడ్, గురు రాజ్ గారిద్దరూ నేను మా అధ్యక్షుడిగా పోటీ చేసినప్పుడు నాకు చాలా సహక రించారు. చాలామందికి ఫోన్ చేసి నాకు ఓటు వేయమని రిక్వెస్ట్ చేశారు. వీళ్ళ ద్వారా నాకు చాలా ఓట్లు వేశారు. వీరికి కృతజ్ఞతలు తెలుపుకోవడానికి నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. నేను ఈ రోజు మా అధ్యక్షుడు హోదాలో కాకుండా వ్యక్తిగతంగా ఈ ప్రమాణ స్వీకారినికి రావడం జరిగింది. ఒక బాధ్యతాయుతమైన పదవిని అలంకరించిన వారు ఎవరైనా సరే ఏం మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడాలి. అలా మాట్లాడకపోతే అది అసోసియేషన్ వాదనగా బయటికి వెళుతుంది. అలా కాకుండా వ్యక్తిగతంగా చెప్పాలనుకుంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని ముందే చెప్పాలి. ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ కు నా వ్యక్తిగత హోదాలో హాజరయ్యాను. సినిమా నటులలో అంటే ఆంధ్ర, తెలంగాణ అనే భేదం మాకు లేదు. మనమందరం తెలుగు వారం. మనమందరం కలసి తెలుగు ఇండస్ట్రీని డెవలప్ చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే నా విజయానికి కృషి చేసిన ప్రతాని రామకృష్ణ గౌడ్ టియఫ్‌సిసి కి నాలుగవసారి ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అన్నారు.
టియఫ్‌సిసి ప్రెసిడెంట్ లయన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. మంచు విష్ణు, మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గార్లు వారికి టైం సహకరించక పోయినా మా ఫంక్షన్ కి వచ్చి మమ్మల్ని, మా టీంను బ్లెస్ చేసినందుకు మా ధన్యవాదాలు. ఈ ఛాంబర్ కేవలం తెలంగాణ వారికే కాకుండా తెలుగు సినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులందరికీ సంబంధించినది. మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారితో కలసి ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. ఈ రోజు ఆయన వెంట ఉంటే నేను ఉన్నతమైన పదవిలో కొనసాగే వాణ్ని. కానీ నేను సినిమా ఇండస్ట్రీని అభివృద్ధి చేయాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చాను. నేను నైజాంలో 125 సినిమాల వరకు డిస్ట్రిబ్యూషన్ చేశాను. 1990 లో శివాజీ రాజా హీరోగా చేసిన అల్లరి పెళ్ళాం సినిమాతో నిర్మాతగా మారి అనేక సినిమాలు నిర్మించాను. అలాగే నేను 7 సినిమాలకు దర్శకుడిగా కూడా పని చేయడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ గారి సినిమాకు దర్శకత్వం వహించే అదృష్టం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇండస్ట్రీకి మేలు చేయాలనే తలంపుతో ఏడుగురు సభ్యులతో ప్రారంభమైన తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ ఈరోజు 10 వేల మంది సభ్యులు కావడం చాలా సంతోషంగా ఉంది. వెంకయ్య నాయుడు హెల్త్ మినిష్టర్ గా ఉన్నపుడు హెల్త్ కార్డ్స్ గురించి తెలియజేయడంతో వారు స్పందించి సుమారు 8,000 మందికి హెల్త్ కార్డులు ఫ్రీ గా ఇప్పించడం జరిగింది. వారికి నా ధన్యవాదాలు. కరోనా టైంలో మేము 20,000 మంది ఆర్టిస్టులకు నిత్యావసర సరుకులు అందజేశాము. అలాగే డిగ్రీ చదువుతున్న పిల్లలకు 15,000 రూపాయల స్కాలర్ షిప్ వచ్చే ఏర్పాటు చేస్తున్నాము. ఆర్టిస్టులు ఎక్కడ ఇల్లు కొనుకున్నా 2,50,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. ఇలా అనేక కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. ఎంతో మంది ఇల్లు లేని పేద ఆర్టిస్టులకు, టెక్నీషియన్స్ ఎంతో మంది ఉన్నారని ఇళ్ల స్థలాల కోసం 10 ఎకరాలు ఇవ్వమని మన ప్రియతమ ముఖ్యమంత్రి కేసిఆర్ గారిని కలసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది కూడా త్వరలో జరగబోతుంది. ఇలా చేతనైనంత వరకు మేము సహాయం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో తెలంగాణ ఆంధ్ర అనేది కాకుండా మనమంతా తెలుగు సినిమా పరిశ్రమను ఇంకా అభివృద్ధి చేసుకొనే దిశగా అడుగులు వేయాలనే తలంపుతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము. అందరి సహాయ సహకరాలతో ముందుకు వెళ్తామని ఆన్నారు.
టియఫ్‌సిసి వైస్ చైర్మన్ గురురాజ్ మాట్లాడుతూ.. మా కార్యక్రమానికి విచ్చేసిన తలసాని గారికి మంచు విష్ణు గారికి ధన్యవాదాలు. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా కూడా ‘మా’ అధ్యక్షుడుగా ఎవరు గెలుస్తారు అని ఉత్కంఠగా ఎదురు చూసిన తరుణంలో మంచి మెజారిటీతో మంచు విష్ణు గెలిచి శభాష్ అనిపించుకున్నారు. ఈ రోజు వారు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ప్రతాని గారు అధ్యక్షుడుగా నాల్గవ సారి ఎన్నికవడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న ఈ అసోసియేషన్ పదివేలమంది నుంచి లక్ష మంది అయ్యే స్థాయికి చేరుకునేలా రామకృష్ణ అన్న ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుతున్నాను అన్నారు.
వైస్ చైర్మన్ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. మేము కష్టపడి ఛాంబర్ ను అభివృద్ధి చేస్తామని అన్నారు. వైస్ చైర్మన్ నెహ్రు మాట్లాడుతూ..మా ఛాంబర్ కు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని అన్నారు. సెక్రటరీ జె.వి ఆర్ మాట్లాడుతూ..రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ఛాంబర్ ని అభివృధ్ది పథంలో నడిపిస్తాడనే నమ్మకం ఉందని అన్నారు. టి.మా ప్రెసిడెంట్ రష్మీ రాథోడ్ మాట్లాడుతూ..తెలంగాణ ‘మా’ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న రామకృష్ణ గారికి ధన్యవాదాలు. తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్ట పడతాం అని అన్నారు.
టి.మా సెక్రటరీ స్నిగ్ద మాట్లాడుతూ.. ఎంతో మంది మెంబెర్స్ కు హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. మేము ఇంకా ముందు మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని అన్నారు. టి.మా వైన్ ప్రెసిడెంట్ సౌమ్య జాను మాట్లాడుతూ.. మా టీంలో నేను భాగం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. అందరి సపోర్ట్ తో మేము హార్డ్ వర్క్ చేస్తాము అన్నారు. రావణ లంక నిర్మాత, హీరో క్రిష్ మాట్లాడుతూ.. చాలా మందికి కరోనా టైంలో హెల్ప్ చేయడమే కాక హెల్త్ కార్డ్ లు కూడా ఇప్పించడం జరిగింది. తెలంగాణ లోని ఒక గ్రామంలో సర్పంచ్ గా గెలిచిన రామకృష్ణ గారు ఈ రోజు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ బి.కిషోర్ పటేల్, ఆర్గనైజర్ సెక్రెటరీ డాక్టర్ వి.రామారావు గౌడ్, టి.మా వైస్ ప్రెసిడెంట్ జ్యోతి రెడ్డి, జాయింట్ సెక్రటరీస్ వేణు గోపాల్ రావ్, కల్యాణి నాయుడు, రాజయ్య, జి.చెన్నారెడ్డి,ఆర్గనైజింగ్ సెక్రటరీస్ యమ్.అశోక్,కె.యల్. యన్.ప్రసాద్, ఈ.సి మెంబర్స్ లయన్ డి.ప్రేమ సాగర్, లయన్ సి.హెచ్.శ్రీశైలం తదితర సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కు ఎన్నికైనందుకు ధన్యవాదాలు తెలుపుతూ తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధి కొరకు పాటుపడతాం అని అన్నారు.