మహారాష్ట్ర టీఈటీ (TET) పేపర్ లీకేజీ కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బిజేంద్ర కుమార్ గుప్తా భార్యను థానే పోలీసులు మంగళవారం పాట్నాలో అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేయగా థానే జిల్లాలోని కొంగోవ్ పరిధిలో జరిపిన ఒక ఆపరేషన్‌లో నాలుగు సెట్ల ప్రశ్నాపత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులను విచారించగా బీహార్‌కు చెందిన బిజేంద్ర గుప్తానే ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారి అని తేలింది.
బీహార్ నివాసి అయిన బిజేంద్ర గుప్తాకు పరీక్షల పేపర్ లీకేజీ ఆరోపణలు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా అతను పలు పేపర్ లీకేజీ కేసులతో సంబంధాలు కలిగి ఉన్నాడని, చాలాసార్లు అరెస్ట్ కాకుండా తప్పించుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. టీఈటీ ప్రశ్నాపత్రం లీకేజీపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర ప్రభుత్వం.. నిందితులపై కఠినమైన వ్యవస్థీకృత నేరాల నియంత్రణ చట్టం ‘మకోకా’ (MCOCA) ను ప్రయోగించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సోమవారం అసెంబ్లీకి తెలిపింది.
గత వారం జరిగిన ఈ పేపర్ లీకేజీ నేపథ్యంలో ప్రతిపక్షాల నుండి రాజీనామా డిమాండ్లను ఎదుర్కొంటున్న పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదా భూసే, ముంబైలో జరుగుతున్న అసెంబ్లీ వర్షాకాల సమావేశాలలో ఈ మేరకు ప్రకటన చేశారు. అలాగే టీఈటీ మరియు ఇతర రాష్ట్ర స్థాయి పరీక్షలను ఆన్‌లైన్ (కంప్యూటర్ ఆధారిత) పద్ధతిలో నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయడానికి చీఫ్ సెక్రటరీ (ముఖ్య కార్యదర్శి) నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
ఈ కేసుపై అసెంబ్లీలో మంత్రి భూసే మాట్లాడుతూ.. ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి పోలీస్ కస్టడీకి పంపించాం. ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఈ కేసును విచారిస్తోంది. జూన్ 28న జరగాల్సిన టీఈటీ పేపర్ లీకేజీ కేసులో ఎవరైనా సరే దోషులుగా తేలితే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. నిందితులపై ‘మకోకా’ చట్టాన్ని ప్రయోగించవచ్చా అనే కోణంలో ప్రభుత్వం పరిశీలిస్తోంది అని స్పష్టం చేశారు.
Also Read:ఈడీ అధికారుల దాడిపై కేరళం ప్రభుత్వం

