చిరు ఇంట్లో సినీ ప్రముఖులు భేటీ..

103
Megastar Chiranjeevi
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి ఇంట్లో టాలీవుడ్‌ ప్రముఖులు ఆదివారం భేటీ అయ్యారు. సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చిందే సినీ పెద్దలు ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అపాయింట్‌మెంట్‌ కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఏపీ సీఎం నుంచి చిరంజీవికి పిలుపొచ్చింది. మంత్రి పేర్ని నాని నేరుగా చిరుకి ఫోన్‌ చేసి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌కు విన్నవించాల్సిన విషయాలపైనా చర్చించి జగన్‌ను కలవాలని సినీ ప్రముఖులు సోమవారం చిరంజీవి ఇంట్లో సమావేశమయ్యారు.

ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడు నారాయణ దాస్‌ నారంగ్‌, నాగార్జున, అల్లు అరవింద్‌, సురేష్‌ బాబు, ఆర్‌. నారాయణమూర్తి, దిల్‌ రాజు, కే.ఎస్‌.రామారావు , దామోదర్‌ ప్రసాద్‌, ఏషియన్‌ సునీల్‌, స్రవంతి రవికిశోర్‌, సి. కళ్యాణ్‌, ఎన్వీ ప్రసాద్‌, కొరటాల శివ, వి.వి.వినాయక్‌, జెమిని కిరణ్‌, సుప్రియ, యూవీ క్రియేషన్స్‌ విక్కీ- వంశీ, నిర్మాతల సంఘం, డిస్ట్రిబ్యూటర్స్‌, ఎగ్జిబిటర్స్‌ ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఇటీవల ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఉన్న అంశాలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, సమస్యలకు సరైన పరిష్కార మార్గం ఏంటి? అన్నిటికీ త్వరగా పరిష్కరించాలి అన్నది ప్రధాన డిమాండ్‌గా సీఎంతో జరిగే సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా టికెట్‌ రేటు, పన్ను రాయితీ తదితర అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది. అయితే ఏపీ సీఎం జగన్‌తో సమావేశం ఎప్పుడన్నది తెలియాల్సి ఉంది.

కాగా గత కొంతకాలంగా కరోనా మహమ్మారి కారణంగా తెలుగు చిత్ర పరిశ్రమ స్తంభించిపోయింది. మూతపడిన థియేటర్లు ఇటీవల తెరుచుకున్నాయి. ఆంధ్రాలో 50 శాతం ఆక్యుపెన్సీతో కొన్ని థియేటర్లలో మాత్రమే సినిమాలు ప్రదర్శిస్తున్నారు. థియేటర్‌ యజమానుల సమస్యలు, టికెట్‌ రేట్ల సమస్యలను చర్చించేందుకు ఆంధ్రా సీఎంతో సినీ ప్రముఖులు భేటి అయ్యి సమస్యలను విన్నవించుకోవాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -