దేశంలో మరే రాష్ట్రానికి దక్కని విధంగా తెలంగాణ పంచాయతీరాజ్ శాఖకు 7 జాతీయ ఉత్తమ అవార్డులు వచ్చాయి. జిల్లా, సమితి/మండలం, గ్రామ పంచాయతీ మూడు కేటగిరీల్లోనూ జనరల్ కోటాలో తెలంగాణకు అవార్డుల పంట పండింది. ప్రతి ఏటా కేంద్రం మూడు విభాగాల్లో ఈ దీన్ దయాళ్ పంచాయత్ సశక్తి కరణ్ పురస్కార్ అవార్డులను ప్రకటిస్తున్నది. సిఎం కెసిఆర్ దార్శనికతకు, పనితీరుకు ఈ అవార్డులు నిదర్శనం. సిఎం కెసిఆర్ స్ఫూర్తి, ప్రేరణ వల్లే, నిరంతర నిఘా, పర్యవేక్షణ, పర్యటనలు, ప్రజలతో, అధికారులతో మమేకమవుతున్న కారణాలతోనే ఈ అవార్డులు సాధ్యమయ్యాయి. ఈ అవార్డులు రావడం వెనుక సిఎం నేతృత్వంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతోపాటు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వంటి ప్రత్యేక కార్యక్రమాలు కూడా దోహదం చేశాయి.
అభివృద్ధి విషయంలో అలుపెరుగకకుండా సీఎం కెసిఆర్ సమీక్షలు చేస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు అధికారులను ప్రోత్సహిస్తూ, ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ చేస్తున్న కృషి ఫలిస్తున్నది. ప్రతి గ్రామ పంచాయతీలో ఆ ఫలితాలు ప్రతి ఫలిస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
పల్లెలను అద్దాల్లా మార్చేందుకు సీఎం కెసిఆర్ పల్లె ప్రగతి పథకాన్ని తెచ్చారు. ఇప్పటికే రెండు విడతలుగా పల్లె ప్రగతి పూర్తి అయింది. అయితే జూన్ 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పల్లె ప్రగతిలో భాగంగానే, నూటికి నూరు శాతం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించాం. పల్లె ప్రగతి కార్యక్రమాల వల్ల గ్రామాలు పచ్చదనం-పరిశుభ్రతను సంతరించుకున్నాయి. ఈ కారణంగా కరోనా వైరస్ కూడా పల్లెల్లోకి సోకలేదు. కేవలం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల వల్ల మాత్రమే కొద్ది మేర కరోనా వచ్చింది. అయినా, కరోనాను కంట్రోల్ చేయగలిగాం.పల్లెల్లో కరోనా కంట్రోల్ అయిందంటే… అది కేవలం పల్లె ప్రగతి కార్యక్రమాల అమలు వల్లే జరిగింది. ఇప్పటికీ పల్లెలు కరోనాకు సాధ్యమైనంత వరకు దూరంగానే ఉన్నాయి.
ప్రగతి కార్యక్రమం కూడా పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడానికి దోహదపడింది. పట్టణాల్లో ఇతర ప్రాంతాల ప్రజల రాకపోకలతోపాటు, జన సాంద్రత ఎక్కువగా ఉన్న కారణంగా కరోనా విస్తరణ జరుగుతున్నప్పటికీ, సాధ్యమైనంత కంట్రోల్ లోనే ఉంది. ఇదంతా సిఎం కెసిఆర్ కృషి ఫలితం అన్నారు మంత్రి.
అలాగే అంతర్గత రోడ్లు, సిసి రోడ్లు, మురుగునీటి కాలువల విషయంలోనూ గతంలో కంటే అధికంగా ఈ సారి పూర్తి చేసుకోగలిగాం. హరిత హారంలో భాగంగా పల్లెల్లో నర్సరీల ద్వారా మొక్కల పెంపకంతో పాటు, మొక్కలను నాటి పెంచడం కూడా చేస్తున్నాం. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లను, ట్రాలీ, ట్యాంకర్లను ఇవ్వడం వల్ల… పారిశుద్ధ్యం, ఇతర పనులు సులువయ్యాయి. తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే సెగ్రిగేటెడ్ డంప్ యార్డులు, స్మశాన వాటికలు నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతి స్మశానవాటిక, నర్సరీల కోసం గ్రామాలకు మంచినీటికి బోర్లు వేశారు, మోటార్లు బిగించారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా నీటి కొరత తీరింది.
ఇంటింటికీ మిషన్ భగీరథ స్వచ్ఛమైన, భూ ఉపరితళ, ఆరోగ్యకరమైన మంచినీరు నల్లాల ద్వారా అందుతున్నాయి. దీంతో గ్రామాల్లో అభివృద్ధితోపాటు, పరిశుభ్రత, పచ్చదనం, ఆహ్లాద, ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొన్నది. మిషన్ కాకతీయ వంటి పథకాలతో గ్రామాల్లో చెరువులు నిండి భూగర్భ జలాలు పెరిగాయి. రైతాంగానికి ఈ నీరు పాడి పంటలతో రాష్ట్రం ,గ్రామాలు సుభిక్షంగా ఉండడానికి దోహదపడుతున్నాయి.
కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు…ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు, తెలంగాణ ప్రభుత్వ చర్యలు ప్రజల్ని సుఖ శాంతులతో ఉండేలా చేస్తున్నాయి. మరోవైపు రైతాంగానికి ట్రాక్టర్లు, అందుబాటులో విత్తనాలు, ఎరువులు, రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీలు, 24 గంటలపాటు ఉచిత విద్యుత్, సాగునీరు, అన్నదాతలకు వెన్నుదన్నుగా మారాయి. సిఎం కెసిఆర్ బర్లు, గొర్రెలు, చేపలు వంటి ఆయా కులాలకు వృత్తుల వారీగా ప్రోత్సాహాకాలు ఇస్తున్నారు. దీంతో గ్రామాల్లో అంతరించిపోతున్న వృత్తులను కాపాడుతూ, గ్రామాలను స్వయం సమృద్ధంగా తీర్చిదిద్దుతున్నారు.
అద్భుతమైన పోలీసింగ్ తో ఫ్రెండ్లీ పోలీసు వాతావరణంలో పల్లెలు కూడా ప్రశాంతంగా ఉంటున్నాయి. సిఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇలాంటి పలు రకాల పథకాలు గ్రామాలను గత కాలపు రూపు రేఖలను మార్చేలా చేశాయి. ఇలాంటి అనేకానేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ప్రత్యేక కార్యక్రమాలు, కారణాలే… తెలంగాణ గ్రామాలకు అవార్డులను తెచ్చిపెడుతున్నాయి.
ఉత్తమ అవార్డులు పొందిన జిల్లా/మండలం/ గ‌్రామ పంచాయతీలకు అభినందనలు. అవార్డులు పొందిన పంచాయతీలకు, ప్రజాప్రతినిధులు, ప్రజలకు శుభాకాంక్షలు. సిఎం కెసిఆర్ గారికి, గ్రామాల అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలుస్తున్న మంత్రివర్గ సహచర మంత్రులకి, అధికారులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు
ఉపాధి హామీలో మనమే నెంబర్ వన్
ఉపాధి హామీ పథకం వినియోగంలో తెలంగాణ, దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. 2020-21 ఏడాదికి 13 కోట్ల పనిదినాల లక్ష్యం కాగా, ఇప్పటికే 9.81 కోట్ల పనిదినాలను పూర్తి చేసుకుంది. అంటే ఇది 75.5 శాతం. దీంతో లక్షలాది మందికి ఉపాధి లభిస్తున్నది. కరోనా కష్ట కాలంలోనూ ఉపాధి హామీలో నెంబర్ వన్ గా నిలిచాం. నెంబర్ 2 స్థానంలో నిలిచిన చత్తీస్ గడ్ 53. 5శాతంగా ఉంది.
ఉపాధి హామీలో దేశ సగటు కేవలం 26.3 శాతం మాత్రమే. ఉపాధి హామీలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నందుకు సీఎం కెసిఆర్ కూడా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రిగా ఉన్న నన్ను, అలాగే నేను నిర్వహిస్తున్న శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు, కలెక్టర్లను కూడా సిఎం అభినందించారు. వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
ఉపాధి హామీని వ్యూహాత్మకంగా సాధ్యమైనంత ఎక్కువ మంది కూలీలకు ఉపాధి లభించే విధంగా వాడుకోవాలని సిఎంగారు ఎప్పటికప్పుడు చెబుతున్నారు. కాలువల పూడిక తీత వంటి పనులకు ఉపాధి హామీ పథకాన్ని వినియోగించుకోవడం ద్వారా వ్యవసాయ రంగానికి మరింత మేలు జరిగేలా చూడాలని ఆదేశించారు.
ఇదే స్ఫూర్తి కొనసాగాలని, వచ్చే ఏడాది మరిన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలు ఈ అవార్డులకు పోటీ పడాలని, మరిన్ని అవార్డులు దక్కాలని ఆకాంక్షిస్తున్నాను. సిఎం దిశానిర్దేశం, స్ఫూర్తి, దీక్షా దక్షతలు, కృషితో…మంత్రిగా నేను, ఇతర మంత్రుల, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో, ప్రజలను భాగస్వాములను చేస్తూ… మేమంతా కష్టపడి…మరిన్ని అవార్డులు వచ్చే విధంగా పని చేస్తాం. పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అనే సామెతను రుజువు చేస్తామని ప్రతిన బూనుతున్నాం. సిఎం కెసిఆర్ కి, ఈ అవార్డులు దక్కడానికి కారణమైన అధికారులు, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను అని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.