ఆరోగ్య,జ్ఞానవంతమైన తెలంగాణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్ లో సీఐఐ – ఇండియన్ విమెన్ నెట్వర్క్ హెల్త్ కాన్ఫరెన్స్ కు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మహిళ సమాజంలో సీఐఐ మరింత విస్తరిస్తుందని ఆశీస్తున్నాని చెప్పారు.
ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపిన ఆయన జూన్ నుంచి 2వేల రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నామని చెప్పారు. ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి కుటుంబం కోసం బీడీలు చుట్టే మహిళలకు దేశంలో ఎక్కడలేని విధంగా పెన్షన్ ఇస్తున్నామన్నారు.
గ్రామాల్లో ప్రభుత్వం ఇచ్చే ఇండ్లు, భూములు మహిళల పేరుతో ఇస్తున్నామని చెప్పారు. నీళ్ల కోసం మహిళల కష్టాలను గుర్తించి ఇంటింటికి నల్లా నీరు అందిస్తున్నామని.. ఆదిలాబాద్ లో ఉండే మహిళలు, బంజారాహిల్స్ లో ఉండే మహిళలకు మిషన్ భగీరథ తో ఒకే రకమైన మంచి నీరు అందిస్తున్నామని చెప్పారు.
కేసీఆర్ కిట్ ద్వారా సిజేరియన్ ఆపరేషన్స్ తగ్గుతున్నాయని చెప్పిన ఈటల కూతురు ప్రసవం ఖర్చు కోసం అమ్మగారి ఇంటిమీద ఆధారపడకుండా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా డెలివరీ చేస్తున్నామని వెల్లడించారు. ఆరోగ్య సమాజం కోసం ప్రాక్టికల్ గా పనిచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ తగ్గించినా ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు.