ఆ 7మండలాలు తెలంగాణలో కలపాల్సిందే : మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

61
puvvada
- Advertisement -

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని ఇటీవల వచ్చిన వరద పరిస్థితులకుఇదే కారణమని తెలిపారు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌. భద్రాచలం ముంపు ప్రాంతానికి శాశ్వత పరిష్కారం దిశగా త్వరలోనే చర్యలు చేపడతామని చెప్పారు. టీఆర్ఎస్ఎల్పీ లో సమావేశమైన మంత్రి అజయ్‌ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన 7 మండలాలు, భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలు తెలంగాణలో కలపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏపీకి ఆ ఐదు గ్రామాలు దూరంగా ఉంటాయని దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలన్నారు. పార్లమెంట్‌లో బిల్లు పెట్టి ఐదు గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని కోరారు. పోలవరం ఎత్తు తగ్గించాలని చాలా సార్లు కోరామన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాథమిక డిజైన్‌ మార్చి మూడు మీటర్లకు ఎత్తు పెంచుకున్నారు. దీనివల్లే భద్రాచలానికి వరద వచ్చిందన్నారు. ఎత్తు తగ్గించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని మంత్రి పేర్కొన్నారు. వరదల నివారణకు, ఎత్తు తగ్గించేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ చూపాలన్నారు. భద్రాచలం ఇరువైపులా కరకట్టల పటిష్టం చేసేందుకు ముంపు బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన చర్యలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. రూ.1000 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని నిర్ణయించిన కేసీఆర్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లా తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -