ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు, ప్రశంసలు పొందుతూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా కేంద్రం ప్రకటించిన 4స్టార్, 3 స్టార్, 2 స్టార్ రేటింగ్ స్వచ్ఛ సర్వెక్షణ్ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికి మొదటి స్థానాల్లో అవార్డులు రావడం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
కేంద్రం ప్రకటించిన 4 స్టార్ రేటింగ్ స్వచ్ఛ సర్వెక్షణ్ అవార్డుల్లో మొదటి మూడు మన రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అచీవర్స్ 3 స్టార్ రేటింగ్ లో సిద్దిపేట జిల్లా మొదటి స్థానంలో నిలువగా జగిత్యాల జిల్లా రెండవ స్థానాన్ని సాధించిందన్నారు.
పెర్ఫార్మర్స్ 2 స్టార్ రేటింగ్ లోనూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొదటి స్థానాన్ని సాధించడం మన తెలంగాణ గ్రామాల గొప్పతనం అన్నారు. స్వచ్చ భారత్ మిషన్ గ్రామీణ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ అవార్డులను పోస్ట్ చేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభినందించడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లోని స్వచ్ఛత అంశాలను పరిగణనలోకి తీసుకొని జిల్లాలకు ర్యాంకులను స్టార్ రేటింగ్ ల వారీగా విడుదల చేసిందన్నారు.కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్ర పథాన నిలుపుతూ దేశానికి తెలంగాణ రోల్ మోడల్ గా చేయడంలో సీఎం కేసీఆర్ గారి అకుంఠిత దీక్ష, దూర దృష్టి, పరిపాలన దక్షత ప్రధాన కారణాలు అన్నారు.
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు గారి మార్గదర్శకాలతో ఆరంభించిన పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో గుణాత్మక మార్పులు వస్తున్నాయన్నారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రం పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నా… రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులు రాకుండా అడ్డంకులు సృష్టిస్తున్నా తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో అవార్డులు పొందడం సీఎం కేసీఆర్ గారి పని తీరుకు, తెలంగాణ అభివృద్ధికి నిదర్శనం అన్నారు.
పచ్చదనం, పరిశుభ్రతలో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే అనేక అవార్డులు ప్రశంసలు అందుకుందని, ఈ పరంపర కొనసాగుతోందని తెలిపారు.పల్లె ప్రగతి లో భాగంగా గ్రామాల్లో చేపట్టిన హరితహరం, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, ట్రాక్టర్ల ఏర్పాటు, పొడి చెత్త – తడి చెత్త సేకరణ, కంపోస్ట్ ఎరువు తయారీ వంటి అంశాలు తెలంగాణ పల్లెలను జాతీయ స్థాయిలో ఆదర్శ గ్రామాలుగా నిలుపుతున్నయని అన్నారు.
ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని, పచ్చదనాన్ని పరిరక్షించాలని మంత్రి కోరారు.అవార్డులు రావడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..