కరోనా పడగ…ఆగని ఉపాధి

99
mgnregs

గ్రామీణ ప్రాంతాల్లోని కూలీలకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో చేపట్టిన ఉపాధి హామీ పథకం..తెలంగాణలో కూలీలకు వరంలా మారింది. కరోనా విపత్తు వేళ కూలీల బ్రతుకుల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది. రోజుకు లక్షల మందికి పైగా ఉపాధి దొరుకుతుండగా దీని వెనుక ఉన్న ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ల దగ్గరి నుండి ఏపీవో,ఎంపీడీవో ఉన్నతాధికారులను ప్రశంసించకుండా ఉండలేం.

ముఖ్యంగా ఫీల్డ్ అసిస్టెంట్‌లు లేకున్నా పంచాయతీ కార్యదర్శుల సహకారంతో టెక్నికల్ అసిస్టెంట్లు దగ్గరుండి కూలీలకు పనులు కల్పిస్తున్నారు. ఏపీవో,ఎంపీడీవోలు తగు సూచనలిస్తూ వారి వారి మండలాల్లో అధికంగా కూలీలకు పనులు కల్పించేలా కృషిచేస్తున్నారు. పల్లెల్లో కరోనా పడగ విప్పుతున్న జోరుగా ఉపాధి పనులు జరుగుతున్నాయంటే ఉపాధి సిబ్బందికి సెల్యూట్ చేయాల్సిందే. ముఖ్యంగా క్షేత్రస్ధాయిలో కూలీలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉపాధి బ్రేక్‌ పడకుండా చూస్తున్నా టెక్నికల్ అసిస్టెంట్(టీఏ)ల పాత్ర అమోఘం.

ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఫ్రంట్ వారియర్స్‌లా… కూలీలు చేసిన పని పరిమాణం, ప్రతి వారం కూలీల సమక్షం లో కొలతలు తీసి వారికి పేమెంట్ వచ్చేలా కీ రోల్ పోషిస్తున్నారు టీఏలు. ఈ క్రమంలో పలు జిల్లాల్లో టీఏలు మృతిచెందిన సంఘటనలు చోటు చేసుకున్నా….పేద కూలీల మొహంలో ఆనందం చూడటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పలువురు టీఏలు చెబుతున్నారు.

అంతేగాదు కూలీలకు వడదెబ్బ తగలకుండా పని చేసే ప్రాంతాల్లోనే టెంట్లు వేసి అక్కడ నీరు, మందులను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు ఏవైనా ఆరోగ్య పర మైన ఇబ్బందులు ఉంటే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధిపనుల్లో అవలంబిస్తున్న కనీసదూరం, భద్రతాచర్యలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రశంసించిందంటే ఉపాధి హామీ సిబ్బంది ఎంత కష్టపడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.