నాడు సోషల్ మీడియా కింగ్…నేడు…?

86
modi

మోదీ…సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం ఈ పేరు మార్మోగని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఉండదు. మోదీ జపంతో ఆయన చేసేది ఎంతో తెలియదు గానీ ఆయన వస్తే ఏదో జరుగుతుందని భ్రమ కల్పించారు. ముఖ్యంగా బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ చేసిన హంగామా అంతా ఇంతకాదు. దేశంలో ఎక్కడ ఏం జరిగిన మోదీ వస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావోద్వేగాలను రెచ్చగొట్టారు…దానికి తగ్గ ప్రతిఫలం పొందారు. ఇదంతా గతం. సరిగ్గా ఏడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు అదే సోషల్ మీడియా మోదీ జపం చేస్తోంది. అయితే ఈసారి మాత్రం వ్యతిరేకంగా.

ఎందుకింత తేడా…ఎందుకింత వ్యతిరేకత.మోదీ ప్రభ మసకబారటానికి గల కారణం ఆయన తీసుకున్న నిర్ణయాలే. రోజురోజుకు ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు,రికార్డు స్ధాయిలో పెట్రోల్,డీజీల్ ధరలు వీటికి తోడు కరోనా కట్టడిలో పూర్తిగా విఫలం కావడం. దేశంలో కరోనా మరణ మృదంగం చేస్తూంటే ఏం చేయాలో తెలియక,ఈ పాపం ఎవరిపై వేయాలో అర్థం కాక కమలనాథులు బయటకురావడం సంగతమేమో కానీ నెట్టింట్లో సైతం మొహం చాటేయాల్సిన పరిస్ధితి వచ్చింది.

ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో 60 శాతం మంది భారతీయులు కరోనా పాపం మోదీ సర్కార్‌దేనని వెల్లడించగా సోషల్ మీడియాలో #ResignModi అంటూ కోట్ల సంఖ్యలో ప్రజలు సంతకాలు చేశారంటే పెద్దసార్‌పై ఎంత వ్యతిరేకత ఉందో అర్ధమవుతోంది. చివరకు న్యాయస్థానాలు సైతం జోక్యం చేసుకుని మోదీ సర్కార్‌ని తూర్పారబట్టాయంటే మోదీ 2.0 అట్టర్ ఫ్లాప్‌ అనే అర్ధమవుతోంది.

సోషల్ మీడియాలోనైతే మోడీ వేష భాషలు సూక్తులు గొప్పలు అపహాస్యం పాలవుతున్నాయి. ఆఖరుకు సుప్రీం కోర్టు కూడా ఆక్సీజన్ పంపిణీ తదితర అంశాలపై ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ కేంద్ర విధానం అసమానతలతో నిండివుందని రాజ్యాంగం 119,21 అధికరణాలనకు

విరుద్ధమని వ్యాఖ్యానించింది. ఇందుకు బదులుగా కేంద్రం వాక్సిస్ విషయంలో సుప్రీం జోక్యం అవసరం లేదని నోట్ సమర్పించింది. జాతీయ,అంతర్జాతీయంగా మీడియాలోనూ వచ్చే తీవ్రమైన అభిశంసనను తప్పించుకోలేకపోతుంది మోదీ సర్కార్‌. కోవిడ్ 19 విషయంలో ఎన్డీఏ ఎన్ని తప్పులు చేసిందో ఉదాహరణలతో సహ వివరించిన వాటిని మోదీ ప్రభుత్వం గాని బిజెపి పార్టీ నాయకత్వం గాని విమర్శించలేని దుస్థితి. ఏదిఏమైనా కరోనా కట్టడిలో విఫలమైన మోదీ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.