తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారు.. ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా వచ్చిన నరసింహన్ రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా కొనసాగుతూ వస్తున్నారు. కేంద్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చాలా రాష్ట్రాల గవర్నర్‌లు మారారు. అలాగే తెలుగు రాష్ట్రాల గవర్నర్‌లు కూడా మారే అవకాశం ఉందని అంతా భావించారు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో గవర్నర్ మార్పిడి మంచిది కాదని భావించిన కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రల గవర్నర్ నరసింహన్‌ను మాత్రం కదిలించలేదు. తాజాగా తెలంగాణ రాష్ట్రంకు కొత్త గవర్నర్‌ను నియమించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే గవర్నర్ పదవీకాలం మేలోనే ముగిసినా.. కేంద్రం నరసింహన్ పదవీ కాలాన్ని పొడిగించింది. ఈ క్రమంలో రాష్ట్రపతి ఎన్నికలు రావడంతో ఉప రాష్ట్రపతి అభ్యర్థుల పేర్లలో ఆయన పేరు కూడా వినిపించింది. ఎన్డీఏ పక్షాల తరపున బీజేపీ ఆయనను బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం వెంకయ్యనాయుడు బరిలో దిగడంతో నరసింహన్ కు కేంద్రంలో కీలక బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. నరసింహన్ కు గతంలో ఇంటెలిజెన్స్‌లో పనిచేసిన అనుభవం ఉండడంతో అందులోనే ముఖ్యమైన పదవి ఇవ్వనున్నట్టు సమాచారం.
మరి నరసింహన్ ఖాళీ చేస్తే ఏపీ తెలంగాణలకు వేర్వేరు గవర్నర్లను నియమించాల్సివస్తుంది. అయితే ఆ దిశగా కూడా హోంశాఖ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. కర్ణాటకకు చెందిన సీనియర్ నాయకుడు శంకర్ మూర్తిని తెలంగాణకు గవర్నర్ గా నియమిస్తారని వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కు కిరణ్ బేడీని గవర్నరుగా నియమించవచ్చని సమాచారం. అయితే మోడీ సూచన మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీలో కీలక పాత్ర పోషించిన శంకరమూర్తికి గవర్నర్ పదవి ఇచ్చి గౌరవించాలని మోడీ భావించారు. అందుకే తెలంగాణ గవర్నర్‌గా ఆయన్ను నియమించబోతున్నారు.