తెలంగాణలో ‘రైతుబంధు’ పథకం ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం సకల ఏర్పాట్లు సిద్ధంచేసింది. రైతు బంధు పథకానికి ప్రభుత్వం నిధులును విడుదల చేసింది. ఈ మేరకు ఖరీఫ్ సీజన్ కోసం రూ.6 వేల కోట్లు విడుదల చేస్తూ వ్యవసాయ శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీచేసింది. రైతు బంధు పథకం కింద ప్రభుత్వం ఎకరాకు రూ.4 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది.
ఈ పథకం కింద రైతులకు ఏప్రిల్ 20 నుంచి చెక్కులను పంపిణీ చేయనున్నారు. పథకం అమలు, పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ‘ఫ్లయింగ్ స్క్వాడ్’ను ఏర్పాటుచేసింది. ఈ మేరకు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మంగళవారం (ఏప్రిల్ 10) అధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. చెక్కుల పంపిణీకి గ్రామ, మండల రైతు సమన్వయ సమితీ సభ్యుల సహకారం తీసుకోవాలని అధికారులకు సూచించారు. మొదటి విడతలో 3,300 గ్రామాల వివరాలను చెక్కుల ముద్రణకు బ్యాంకులకు పంపామని మంత్రి అధికారులకు తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే రైతులకు రైతుబంధు పథకం చెక్కులు పంపిణీ చేయనుంది.
ప్రభుత్వం పంపిణి చేయనున్న ఈ చెక్కులపై లబ్దిదారుల పేరు, పాసుబుక్ యూనిక్ ఐడీ, రైతు గ్రామం, మండలం, జిల్లాల పేర్లు ఉంటాయి. కనిష్ఠంగా గుంట భూమి కలిగినవారికి కూడా ఈ పథకం కింద సాయం అందించనున్నారు. అయితే వీరికి కేవలం రూ.100 మాత్రమే అందనుంది. మొత్తం రైతుల్లో వీరు 2 శాతంగా ఉన్నారు.