కార్తీ హీరోగా తెలుగు,తమిళ్‌లో తెరకెక్కిన చిత్రం ఖాకీ. దోపిడీలు,హత్యలు చేసే ముఠా సభ్యులను పట్టుకునేందుకు వెళ్లిన కార్తీ అండ్ కో పై గ్రామస్తులు తిరగబడతారు. అక్కడ దొంగలకు గ్రామస్తులు సపోర్ట్ చేస్తే ఇక్కడ మాత్రం దొంగలనుకొని పోలీసులపై గ్రామస్తులు దాడికి దిగారు. మిగితాదంతా సేమ్ టు సేమ్. ఒడిశాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ చోరీకి పాల్పడిన వారిలో ఓ నిందితుడు ఒడిశాలోని గంజాం జిల్లా దేంగడి గ్రామానికి చెందినవాడుగా గుర్తించిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు 11 మందితో కూడిన ప్రత్యేక టీమ్ ఒడిశాకు బయలుదేరింది. సివిల్ డ్రెస్‌లో తిరుగుతున్న పోలీసులను చూసి పిల్లలను ఎత్తుకెళ్లే దొంగలుగా భావించిన గ్రామస్తులు వారిపై దాడికి పాల్పడ్డారు. గంటసేపు నిర్భందించారు. విచక్షణారహితంగా దాడిచేసి పోలీస్ వాహనాలను ధ్వంసం చేశారు.
విషయం తెలుసుకున్న పటాపూర్ పోలీసులు …తెలంగాణ పోలీసులను రక్షించారు. గాయాలపాలైన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం స్థానిక పోలీసుల సహకారంతో తెలంగాణ పోలీసులు నిందితుడి ఇంటిపై రైడ్ చేసి నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఖాకీ సినిమా తరహాలో పోలీసులపై దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది.